టెలికాం కంపెనీలకు భారీ జరిమానా

టెలికాం కంపెనీలకు భారీ జరిమానా

టెలికాం కంపెనీలు రీచార్జ్ ధరలు విపరీతంగా పెంచేశాయి. కానీ, నెట్‌వర్క్ సమస్యను మాత్రం పట్టించుకోవడంలేదు. కాల్‌డ్రాప్ వల్ల టెలికాం కంపెనీలకు భారీగా జరిమాన విధించినట్లు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ సంజయ్ ధోత్రే తెలిపారు. ఆయన భారత పార్లమెంటుకు ఈ సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భారతీయ టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లలో కాల్ డ్రాప్స్ సమస్య కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ సంజయ్ ధోత్రే భారత పార్లమెంటుకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 2018 నుండి జూన్ 2019 వరకు 10 నెలల కాలానికి టెలికాం కంపెనీలకు కాల్ డ్రాప్ కోసం మొత్తం రూ. 3.2 కోట్లు జరిమానా విధించినట్లు మంత్రి సభకు తెలియజేశారు. ఈ మొత్తంలో వోడాఫోన్ ఐడియాకు ఎక్కువగా రూ. 1.76 కోట్లు ఫైన్ వేసినట్లు ఆయన తెలిపారు. మిగతా అన్నికంపెనీలతో పోలిస్తే ఇది చాలా అత్యధికం.

కాల్‌డ్రాప్స్ కోసం పెనాల్టీ విధించిన కంపెనీలలో దాదాపు అన్ని కంపెనీలు ఉన్నాయి. భారతి ఎయిర్‌టెల్‌కు రూ. 34 లక్షలు; టాటా టెలిసర్వీస్‌కు రూ. 56 లక్షలు; బిఎస్‌ఎన్‌ఎల్‌కు రూ. 47.5 లక్షలు, రిలయన్స్ జియోకు రూ. 6.50 లక్షలు జరిమానా విధించారు. వొడాఫోన్ ఐడియాకు విధించిన రూ. 1.76 కోట్లలో వోడాఫోన్‌ రూ. 1.11 కోట్లు మరియు ఐడియా రూ. 65 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

కాల్‌డ్రాప్ సమస్య నుంచి టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఎవరూ తప్పించుకోలేదని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటులో విఫలమైందని మంత్రి తెలియజేశారు. మిగతా కంపెనీలన్నీకనీస మొబైల్ టవర్లును ఏర్పాటు చేశాయని ఆయన తెలిపారు. నెట్‌వర్క్ లభ్యత ప్రమాణాలపై పశ్చిమ బెంగాల్‌లో బిఎస్‌ఎన్‌ఎల్, జమ్మూ కాశ్మీర్‌లో వొడాఫోన్ ఐడియా విఫలమయ్యాయని మంత్రి పార్లమెంటు సభ్యులకు తెలియజేశారు.