
మంగళూరు: కర్నాటకలో పోయిన ఏడాది పెను దుమారం సృష్టించిన హిజాబ్ వివాదంపై అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సైలెంట్ అయిపోయాయి. వాస్తవానికి ఎన్నికల్లో ఈ వివాదాన్ని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు రాజకీయ అంశంగా మలచుకుంటాయని భావించగా.. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, జేడీఎస్ వంటి పార్టీలేవీ ఈ అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించడంలేదు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు సంబంధించిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) మాత్రమే ఈ ఎన్నికల్లో హిజాబ్ వివాదాన్ని ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది. పోయిన ఏడాది దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో హిజాబ్ వివాదం దుమారం రేపింది. మొదట ఉడుపిలోని ప్రభుత్వ విమెన్స్ కాలేజీలో హిజాబ్ నిషేధంపై ముస్లిం విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఆ తర్వాత ఇతర కాలేజీల్లోనూ నిరసనలు జరిగాయి. కొందరు స్టూడెంట్లు కోర్టుకు వెళ్లగా.. విద్యా సంస్థల్లో యూనిఫామ్ మాత్రమే ధరించాలని, వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
వివాదంలో హైలైట్ అయిన నేతకే టికెట్
హిజాబ్ వివాద సమయంలో ఉడుపి కాలేజీ డెవలప్ మెంట్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న బీజేపీ నేత యశ్ పాల్ సువర్ణ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. పీఎఫ్ఐకి చెందిన స్టూడెంట్ విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఐ), కర్నాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ (కేఎఫ్డీ) సంస్థలే ఈ వివాదాన్ని సృష్టించాయని ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ డెవలప్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్, ఉడుపి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రఘుపతి భట్ కు కాకుండా యశ్ పాల్ కే బీజేపీ టికెట్ ప్రకటించింది. ఈ రెండు జిల్లాల్లో13 అసెంబ్లీ సీట్లు ఉండగా, పోయిన ఎన్నికల్లో12 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి కూడా ఇప్పటికే ఓట్లు పోలరైజేషన్ కావడంతో బీజేపీ హిజాబ్ వివాదంపై కాకుండా అభివృద్ధి పనులపైనే ప్రచారం చేస్తున్నది. మరోవైపు కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా ఈ విషయాన్ని పక్కనపెట్టాయి. ఒక్క ఎస్డీపీఐ మాత్రమే తనకు పట్టు ఉన్న చోట్ల హిజాబ్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రచారం కొనసాగిస్తోంది.
రాష్ట్రాన్ని అభివృద్ధిచేస్తం: ప్రియాంక
టి నరసిపుర: కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అంతులేని అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. రాష్ట్రంలో రూ.1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మైసూరులోని టి నరసిపురలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు.