హిమాచల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు

హిమాచల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. భారీ ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. వర్ష బీభత్సంలో కనీసం పలువురు గల్లంతైనట్లు సమాచారం. రెండు ప్రధాన హైవేలతోపాటు...రాష్ట్రంలోని అనేక రహదారుల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లు తెగిపోవడంతో వర్షంలో ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి గంటల తరబడి సమయం పడుతోంది.  కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మహిళలు శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు. భారీ వర్షాలకు వాన నీరు రోడ్లపై వరదలా ప్రవహించడంతో దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు అస్తవ్యస్తం అయ్యాయి.  

కులు జిల్లా తహసీల్‌లోని షీల్ గ్రామ పంచాయతీలోని ఖాడేల్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడడంతో చావేలు దేవి (55), కృతిక (17) అనే ఇద్దరు  శిధిలాల వల్ల మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుదేష్ మోఖ్తా తెలిపారు. జిల్లాలో పరిధిలోనే ఉన్న  ద్యుతి గ్రామ పంచాయతీ వద్ద 10 దుకాణాలు, మూడు వాహనాలు కొట్టుకుపోయాయి. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సిమ్లా జిల్లాలోని చోపాల్ తహసీల్‌లోని దియందలి నుల్లా వద్ద కుండపోత వర్షం కారణంగా మూడు చిన్న కార్లు మరియు ఒక పికప్ వాహనం కొట్టుకుపోయాయి. మండి జిల్లాలో పండోహ్ సమీపంలోని 7 మైలు వద్ద కొండచరియలు విరిగిపడటంతో మండి-కులు జాతీయ రహదారిని మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఈ మార్గంలోని రాకపోకలను కటౌలా మీదుగా మళ్లించారు. చంబా జిల్లాలో, భర్మూర్ తహసీల్‌లోని అలానుల్లా సమీపంలో క్లౌడ్‌బర్స్ట్ ఘటనలో క్రాషర్, రెండు కంప్రెషర్ మెషీన్లు మరియు నిర్మాణ కంపెనీకి చెందిన స్టోర్ కొట్టుకుపోయాయని అధికారులు నిర్ధారించారు.

లాహౌల్-స్పితి జిల్లాలో జాతీయ రహదారి-3పై రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు కొనసాగుతుండడంతో రోడ్లపై వరద లాంటి పరిస్థితి ఉంది మరియు లాహౌల్ సబ్‌డివిజన్‌లోని టెల్లింగ్ నుల్లా వద్ద ఫ్లాష్‌ఫ్లడ్‌ల తర్వాత కుత్బిహాల్ సమీపంలో రోడ్లపై నిరంతరం రాళ్లు పడుతున్నాయి. లాహౌల్-స్పితి జిల్లాలోని ఉదయపూర్ సబ్‌డివిజన్‌లోని సింధ్వారినుల్లా వద్ద ఆకస్మిక వరదలు రావడంతో రాష్ట్ర రహదారి నంబర్ 26ను బ్లాక్ చేశారు. 
గత 24 గంటల్ల రాష్ట్రంలోనే అత్యధికంగా  సుందర్‌నగర్‌లో 141.8 మిల్లీమీటర్లు, హమీర్‌పూర్‌లో 120 మిమీ, సర్కాఘాట్‌లో 112.3 మిమీ, పౌంటా సాహిబ్‌లో 97.6 మిమీ, చోపాల్‌లో 74 మిమీ, మండిలో 69.8 మిమీ  చొప్పున వర్షపాతం నమోదు అయిందని రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.