వ‌ర‌ద విధ్వంసం.. రైలు ప‌ట్టాలు గాల్లో వేలాడుతున్నాయి..

వ‌ర‌ద విధ్వంసం.. రైలు ప‌ట్టాలు గాల్లో వేలాడుతున్నాయి..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఏకధాటిగా ప్రవహిస్తోన్న వరద రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. ఫలితంగా ఇప్పటికే భవనాలు, ఇళ్లు, ఇతర ఆస్తులు ఊహించని రీతిలో దెబ్బతిన్నాయి. ఆగస్టు 15న సిమ్లాలోని కృష్ణా నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 7 ఇళ్లు కూలిపోయాయి. హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ఇప్పటివరకు 66 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారుల ప్రకారం, కొంతమంది నివాసితులు శిథిలాలలో చిక్కుకున్నారని, NDRF, SDRF, రాష్ట్ర పోలీసు సిబ్బంది సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తున్నారు.

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన సిమ్లాలోని సమ్మర్ హిల్ సమీపంలోని సిమ్లా-కల్కా రైలు మార్గం తీవ్రంగా ధ్వంసమైంది. కొండచరియలు విరిగిపడటంతో 50 మీటర్ల వంతెన కొట్టుకుపోయి, ట్రాక్‌లోని కొంత భాగం మాత్రం గాలిలో వేలాడుతూ కనిపిస్తోంది. అత్యంత భయానకంగా, హృదయ విదారకంగా కనిపించే ఈ తరహా పరిస్థితులు ఇప్పుడు హిమాచల్ లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. సిమ్లాలో కురుస్తున్న భారీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని, కొండచరియలు విరిగిపడటం, నేలకొరిగిన చెట్లు విద్యుత్ లైన్‌లను అడ్డుకోవడంతో విద్యుత్తు సరఫరా కూడా లేదని అధికారులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా చమోలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బద్రీనాథ్ జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. చమోలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పిపల్‌కోటి, గడోరా, నవోదయ విద్యాలయ పిపాల్‌కోటి, గులాబ్‌కోటి వద్ద హైవేని బ్లాక్ చేశారు.