మోడీ ప్రధాని కాకపోతే.. రామమందిర నిర్మాణం జరిగేది కాదు

మోడీ ప్రధాని కాకపోతే.. రామమందిర నిర్మాణం జరిగేది కాదు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,  తమిళనాడు రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ  విశ్వాసం వ్యక్తం చేశారు. గణేశ్ ఉత్సవాలను చూడటానికే భాగ్యనగరానికి వచ్చానని ఆయన తెలిపారు. భారతదేశంలో హిందువులు ఉండటం వల్లనే సెక్యులరిజం ఉందన్నారు. నరేంద్రమోడీ ప్రధాని కాకపోతే రామ మందిర నిర్మాణం జరిగేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

నరేంద్రమోడీ సర్కారు దేశ ప్రజల మనస్సులు గెల్చుకుందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలలో ఏ విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందో ... తెలంగాణ , ఆంధ్ర , తమిళనాడు రాష్ట్రాలలోనూ అదేవిధంగా అధికారంలోకి వస్తుందన్నారు. ‘‘సనాతన ధర్మం వల్లే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. హిందూ ధర్మం జీవన విధానాన్ని తెలియజేస్తుంది’’ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

MJ మార్కెట్ వద్ద ఫ్లెక్సీ వివాదం..

ఇక  హైదరాబాద్ లోని MJ మార్కెట్ వద్దకు  అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ  వస్తుండడం తో  భాగ్య నగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అక్కడ స్టేజీ ఏర్పాటు చేశారు.  అదే సమయంలో MJ మార్కెట్ చౌరస్తా లో మంత్రి తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన భాగ్య నగర్ ఉత్సవ సమితి సభ్యులు.. అక్కడ మంత్రి తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు చేయొద్దని కోరారు. కాసేపట్లో అస్సాం సీఎం అక్కడికి చేరుకుంటారని చెప్పారు. అయితే అక్కడే ఫ్లెక్సీ పెట్టి తీరుతామని  టీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. దీంతో టీఆర్ఎస్ నేతలు, భాగ్య నగర్ ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.