- వరుసగా రెండుసార్లు సీఎం పీఠాన్ని అధిష్టించిన తొలి కాంగ్రెసేతర నేతగా రికార్డ్
- వేడుకకు హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్
- 100 రోజుల్లో భూసంస్కరణలు, పెట్టుబడులే లక్ష్యం: సీఎం హిమంత
- రాజ్యాంగ వేడుకను రాజకీయ బల ప్రదర్శనగా మార్చారు: కాంగ్రెస్
దిస్పూర్: అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర పార్టీ ప్రముఖులు హాజరయ్యారు.
హిమంతతో పాటు, బీజేపీ సీనియర్ నేత రామేశ్వర్ తేలి, అజంతా నియోగ్, ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా, బీపీఎఫ్ ఎమ్మెల్యే చరణ్ బోరో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్రంలో మూడవసారి ఎన్డీయే పాలన ఘనంగా ప్రారంభమైంది. 2021లో సర్బానంద సోనోవాల్ తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి అయిన హిమంత.. అస్సాంలో వరుసగా రెండుసార్లు సీఎం పీఠాన్ని అధిష్టించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2016 నుంచి అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడం ఇది వరుసగా మూడోసారి.
- తొలిసారి సొంతంగా మ్యాజిక్ ఫిగర్
మొత్తం 126 స్థానాలు కలిగిన అస్సాం అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 102 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. ఇందులో ఒక్క బీజేపీయే 82 స్థానాలను కైవసం చేసుకుని.. అస్సాంలో తొలిసారిగా సొంతంగా మెజారిటీ మార్కును దాటింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ పార్టీలు తలో 10 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించాయి. ఈ భారీ మెజారిటీ ఈశాన్య ప్రాంతంలో బీజేపీలో హిమంత స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.
- భూసంస్కరణలపై ప్రత్యేక దృష్టి: సీఎం హిమంత
ప్రభుత్వ ఏర్పాటు అనంతరం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. రాబోయే 100 రోజుల్లో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఆకర్షణ, భూసంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా స్థానిక ప్రజల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ దూరంగా ఉంది. ఈ వేడుకను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఒక రాజకీయ బల ప్రదర్శనగా విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాన్ని పార్టీ ప్రచార సభలా మార్చారని పేర్కొన్నారు.
- అస్సాంకు ఇది గొప్ప రోజు: ప్రధాని
అస్సాంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప రోజుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హిమంత బిశ్వ శర్మను ఎక్స్ వేదికగా అభినందించారు. హిమంత బిశ్వ శర్మ ఒక అద్భుతమైన పాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రం కోసం ఎన్నో వినూత్న పనులు చేశారు. రాబోయే కాలంలో ఆయన మరింత మంచి అందించాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని పేర్కొన్నారు. ప్రధాని పోస్ట్‌కు హిమంత కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ దార్శనికత, నాయకత్వం గత దశాబ్ద కాలంగా అస్సాం వృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. మీ మద్దతుతో అదే దిశలో మేం ఉత్సాహంగా పనిచేస్తాం’ అని మోదీకి హిమంత రిప్లై ఇచ్చారు.
- వేదిక వద్దకు తూటాలతో వ్యక్తి
గువాహటి: అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ గువాహటిలో భారీ భద్రతా లోపం వెలుగుచూసింది. వేదిక సమీపంలో తూటాలు కలిగి ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. గత ఆరు రోజుల్లోనే బీజేపీ అగ్రనాయకత్వం లక్ష్యంగా జరిగిన మూడో భద్రతా సంబంధిత ఘటన కావడం గమనార్హం. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి వీవీఐపీలు సభాస్థలికి చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద తూటాలను గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని బసిష్ఠ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. బెంగాల్, బెంగళూరు తర్వాత అస్సాంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
