జోక్ కాదు నిజం : 25 ఏళ్ల తర్వాత మణిపూర్లో హిందీ సినిమా ప్రదర్శన..ఏ మూవీ వేశారో తెలుసా

జోక్ కాదు నిజం : 25 ఏళ్ల తర్వాత మణిపూర్లో హిందీ సినిమా ప్రదర్శన..ఏ మూవీ వేశారో తెలుసా

మూడు నెలలుగా అల్లర్లు, ఆందోళనలతో రణరంగంగా మారిన మణిపూర్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. అక్కడ ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మణిపూర్ లో  ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.  ఆగస్టు 15వ తేదీ రాత్రి ఓ హిందీ చిత్రాన్ని  అక్కడి విద్యార్థి సంఘాలు ప్రదర్శిస్తున్నాయి. 

మణిపూర్ రాష్ట్రంలోని చురాచాంద్‌పూర్   జిల్లా  రెంగ్‌కాయ్ లో  ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించనున్నట్లు గిరిజన సంస్థ హమర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌  వెల్లడించింది. దశాబ్దాల కాలంగా గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తోన్న కొన్ని సంస్థలపై వ్యతిరేకతను చాటేందుకే సినిమాను ప్రదర్శిస్తున్నట్లు విద్యార్థి సంఘం  ప్రకటించింది. ప్రజల కోసం చేస్తున్న స్వేచ్ఛ, న్యాయ  పోరాటంలో పాల్గొనాలని మద్దతుదారులకు పిలుపునిచ్చింది. అయితే ఏ సినిమా ప్రదర్శిస్తున్నారని చివరి వరకు వెల్లడించలేదు. కానీ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాను వేసినట్లు తెలుస్తోంది. 

మణిపూర్ లో చివరి సారిగా 1998లో ‘కుచ్ కుచ్ హోతా హై’ హిందీ సినిమాను ప్రదర్శించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన  రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్  అనే తిరుగుబాటు సంస్థ మణిపూర్ లో  హిందీ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. అనంతరం ఆ రాష్ట్రంలోని అవుట్‌లెట్లలో 8 000 వరకు ఉన్న హిందీ  ఆడియో, వీడియో క్యాసెట్లు, కాంపాక్ట్ డిస్క్‌లను కాల్చేసింది.  మణిపూర్  రాష్ట్ర భాష, సంస్కృతిపై బాలీవుడ్ ప్రతికూల ప్రభావం చూపుతుందన్న భయంతోనే తిరుగుబాటు  సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల వచ్చిన కశ్మీర్ ఫైల్స్, రాకెట్రీ సినిమాలను రాజధాని ఇంఫాల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అయితే ఈ షోలకు కేవలం కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. తీవ్రవాద సంస్థల భయంతో మణిపూర్‌లోని సినిమా థియేటర్లలో సాధారణంగా ఇంగ్లీష్, కొరియన్, మణిపురి చిత్రాలను ప్రదర్శిస్తారు.

హిందీ చిత్ర ప్రదర్శనపై గిరిజన సంస్థ హమర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్‌లో మళ్లీ  ఓ హిందీ చిత్రం ప్రదర్శించబడుతోంది.