
Cash Deposit Rules: ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దేశంలోని దాదాపు మారుమూల ప్రాంతాలకు సైతం చేరుకుంది. చిన్నచిన్న మెుత్తాలకు సైతం వ్యాపారులు, వినియోగదారులు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించటమే దీనికి కారణం. అయితే ప్రతి రూపాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్ల రూపంలో జరపటం ఆదాయపు పన్ను అధికారుల దృష్టిని ఆకర్షిస్తోంది. చట్ట ప్రకారం కంటే ఎక్కువ మెుత్తాల్లో బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేసిన వారికి అధికారులు నోటీసులు కూడా పంపిస్తున్నారు.
వాస్తవానికి పన్ను అధికారులు హైవాల్యూమ్ ట్రాన్సాక్షన్ల వివరాలను గమనిస్తూనే ఉంటారు. బ్యాంకులు సైతం లిమిట్ దాటి ట్రాన్సాక్షన్స్ చేసే వారి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. ఈ చర్యల ద్వారా మనీలాండరింగ్, పన్ను ఎగవేతలతో పాటు ఇతర అక్రమ ట్రాన్సాక్షన్లు చేసేవారిని పట్టుకుంటుంటారు. అందువల్ల ప్రజలు చట్ట ప్రకారం తమ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లలో ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చో తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టంలో రూల్స్..
- సాధారణ వ్యక్తులు తమ సేవింగ్స్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
- ఇదే క్రమంలో కరెంట్ ఖాతా హోల్డర్లు ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల వరకు డబ్బు డిపాజిట్ చేసుకునేందుకు పన్ను చట్టం అనుమతిస్తోంది.
- ఇక డబ్బు విత్ డ్రా విషయానికి వస్తే.. ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి వరకు మెుత్తాన్ని ఉపసంహరించుకుంటే 2 శాతం టీడీఎస్ వసూలు చేయబడుతుంది. కోటికి పైన విత్ డ్రాలపై 5 శాతం టీడీఎస్ విధించబడుతుంది.
ఇక ఇదే సమయంలో ఎవరినుంచైనా తీసుకున్న రుణాన్ని డబ్బు రూపంలో చెల్లించేటప్పుడు రూ.20వేల కంటే ఎక్కువ మెుత్తానికి చేసే చెల్లింపుపై పన్ను చట్టం ప్రకారం పెనాల్టీ విధించబడుతుంది. అలాగే పన్ను అధికారులు వ్యక్తుల డబ్బు ట్రాన్సాక్షన్లకు సంబంధించి వివరాలను కోరుతూ నోటీసులు పంపించినప్పుడు దానికి సరైన రుజువులను సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయటంలో విఫలమైతే సదరు ఆదాయంపై 60 శాతం పన్ను, 25 శాతం సర్ ఛార్జీ, 4 శాతం సెజ్ మెుత్తాన్ని కలిపి పన్ను శాఖ వసూలు చేస్తుంది.
అందువల్ల ప్రస్తుత కాలంలో ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలను తెలియని వ్యక్తులు లేదా కనీసం చుట్టాలకు కూడా డబ్బు డిపాజిట్ల కోసం ఇవ్వకపోవటం మంచిది. ఎందుకంటే కొన్ని సార్లు వారు చేసే ట్రాన్సాక్షన్లు తప్పుడు పనుల కోసం వినియోగించినట్లు వెల్లడైతే పన్ను అధికారులు, పోలీసులు మీపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.