- ఓ ఇంటికి నిప్పు పెట్టిన దుండుగులు..
- ప్రాణభయంతో పారిపోయిన కుటుంబ సభ్యులు
- చట్టోగ్రామ్ జిల్లాలో ఘటన..
- హిందువులంతా బంగ్లాదేశ్ వదిలిపోవాలని వార్నింగ్ లేఖ
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు హిందువులకు చెందిన ఓ ఇంటిని తగులబెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత హిందూ కుటుంబం పెంచుకుంటున్న మూగ జీవాలను కూడా వదల్లేదు. వాటిని చంపేసి తగులబెట్టేశారు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ధ్వంసం చేశారు.
ఈ ఘటన చట్టగ్రామ్ జిల్లా రావోజన్లో చోటు చేసుకున్నది. ‘‘ఇదే లాస్ట్ వార్నింగ్. హిందువులంతా బంగ్లాదేశ్ వదిలి వెళ్లిపోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటది. ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇక చూస్తూ ఊరుకోం’’ అని బెదిరిస్తూ ఓ లేఖను ఘటనా స్థలంలో వదిలివెళ్లారు.
ఫెన్సింగ్ కత్తిరించి ఇంట్లోకి..
జయంతి సంఘా, బాబు సుఖ్షీల్ కొన్నేండ్లుగా రావోజన్లో నివాసం ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగడంతో అందరూ ఇంట్లోనే దాక్కుని ఉన్నారు. ఆ ఏరియాలోని కొందరు దుండగులు గుంపుగా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను కత్తిరించి లోపలికి చొచ్చుకొచ్చారు. ఇంటి ముందున్న వస్తువులన్నీ ధ్వంసం చేశారు.
భయపడిన జయంతి సంఘా, బాబు సుఖ్షీల్ ఫ్యామిలీ.. ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. దుండగులు ఇంట్లోకి చొరబడి వస్తువులన్నీ పగులగొట్టేశారు. మూగ జీవాలను చంపి ఇంట్లో పడేసి నిప్పు పెట్టారు. కాగా, బాధిత కుటుంబం తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడగా, స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఇలాంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో అక్కడి హిందువుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దాడులపై ఇండియా సహా పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మైనారిటీల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
హెచ్చరిక లేఖలో ఏమున్నది?
ఇంటికి దగ్గరలో బెంగాలీ భాషలో ఓ లేఖను దుండగులు వదిలి వెళ్లారు. ‘‘ఈ ప్రాంతంలోని హిందువులందరిపై మా నిఘా ఉంది. ఎవరేం చేస్తున్నారో గమనిస్తూ ఉన్నాం. ముస్లిం, ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మీ అందరిపై ఆరోపణలు ఉనాయి. మీరంతా రహస్యంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తున్నది.
మాకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మిమ్మల్ని వదలం. ఇస్లాంను వ్యతిరేకించేవాళ్లంతా బంగ్లాదేశ్‌ను వదిలి వెళ్లిపోవాలి. మామాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ ఇండ్లు, ఆస్తులు, షాపులు ఏమీ ఉండవు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఇదే ఫైనల్ వార్నింగ్. ఏ విధంగా అయినా ప్రతిఘటిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అని లేఖలో పేర్కొన్నారు.
ఢాకాలో భారీ నిరసన ప్రదర్శన
బంగ్లాదేశ్‌లో స్టూడెంట్ యూనియన్ నేత, ఇంక్విలాబ్ మంచో సంస్థ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంక్విలాబ్ మంచో ఆధ్వర్యంలో ఆందోళనకారులు మంగళవారం ఢాకాలోని శాహబాగ్లోలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. హాదీని హత్య చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
