పోలీసులే..ఉరికిచ్చి చంపేసిన్రు

పోలీసులే..ఉరికిచ్చి చంపేసిన్రు
  • రేపిస్ట్​ రాజు ఆత్మహత్య..రైలు కింద పడి మృతి.. 
  • పచ్చబొట్ల ఆధారంగా గుర్తింపు..వెల్లడించిన పోలీసులు 
  • స్టేషన్ ఘన్​పూర్ – నష్కల్​శివారులో ఘటన
  • కండ్ల ముందే సూసైడ్​ చేసుకున్నాడన్న సాక్షులు

టాటూలు చూసి గుర్తించినం
మృతుడి చేతులపై ఉన్న ‘మౌనిక’ అనే టాటూల ఆధారంగా రాజుగా  గుర్తించినం. ఉదయం 8.45 గంటలకు కోణార్క్​ ఎక్స్​ ప్రెస్​ కింద పడి ఆత్మహత్య చేసుకున్నడు. కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న రాజు కోసం గాలింపులు తీవ్రం చేసిన టైంలో ఈ ఘటన జరిగింది.               ‑ వరంగల్​ సీపీ తరుణ్​ జోషి

జనగామ/ స్టేషన్​ ఘన్​పూర్​, వెలుగు: సైదాబాద్​ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిని చిదిమేసిన రేపిస్టు రాజు (30) ఆత్మహత్య చేసుకున్నాడు. కోణార్క్​ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ కింద పడి చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​– నష్కల్​ శివారు రైల్వే ట్రాక్​ పై గురువారం ఉదయం 8.45 గంటలకు ఈ ఘటన జరిగిందన్నారు. రెండు చేతులపై ‘మౌనిక’ అని ఉన్న పచ్చబొట్ల ఆధారంగా మృతుడ్ని రాజుగా గుర్తించినట్లు వరంగల్​ సీపీ తరుణ్​ జోషీ చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 
రైల్వే ట్రాక్​పై తిరుగుతుండగా..!
ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..  గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో స్టేషన్​ ఘన్​పూర్​–నష్కల్​ మధ్యలో ఉన్న రాజవరం బ్రిడ్జి వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి కూర్చొని కనిపించాడు. దీంతో ట్రాక్​ పర్యవేక్షణ డ్యూటీ చేస్తున్న రైల్వే కీమాన్​లు తాటి కుమార్​, సారంగపాణి ప్రశ్నించడంతో అతడు ఎదురు తిరిగి కంకర రాయితో కొట్టే ప్రయత్నం చేయగా వారు వదిలేసి వెళ్లి పోయారు. సమీపంలోని రైతులు కూడా చూడడంతో భయపడి.. ట్రాక్​ పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లాడు. జుట్టు పెద్దగా ఉండి, చేతిలో సంచి పట్టుకుని, పిచ్చోడిలా కనిపించడంతో ఎవరో అనుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇదే క్రమంలో ఉదయం 8.45 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్​ కు వెళ్తున్న కోణార్క్​ ఎక్స్​ ప్రెస్​ రైలును గమనించిన అతడు ట్రాక్​ పైకి వచ్చి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. వద్దని అరుస్తున్నా వినిపించుకోలేదన్నారు. ట్రైన్​ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడని, మృతుడి చేతులను పరిశీలించగా ‘మౌనిక’ అనే పచ్చబొట్టు ఉందని చెప్పారు. సైదాబాద్ చిన్నారి అత్యాచార నిందితుడు రాజు ఆనవాళ్లతో సరిపోలడంతో కీమాన్ సారంగపాని 100 కు డయల్ చేసి వివరాలు చెప్పాడు. సమీప రైతులు గేమ్ సింగ్, రాంసింగ్  స్టేషన్ ఘన్​పూర్ ఎస్సై రమేశ్​ కు ఫోన్ చేసి చెప్పారు. ఎస్సైలు రమేశ్​ నాయక్, శ్రీనివాస్  పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. చేతులపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా రాజుగా నిర్ధారించుకుని పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వరంగల్ సీపీ తరుణ్ జోషి, జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్​పూర్ ఏసీపీ రఘునాథ్ వైభవ్  గైక్వాడ్, జనగామ ఏసీపీ వినోద్​ కుమార్​ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించి.. వరంగల్​ ఎంజీఎంకు తరలించారు. సంఘటనా స్థలంలో రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 
ఎట్లొచ్చిండు..!
పోలీసుల సెర్చింగ్​.. సీసీ కెమెరాల కండ్లు గప్పి స్టేషన్​ ఘన్​పూర్​ శివారు వరకు రేపిస్ట్​ రాజు ఎలా వచ్చిండన్నది తేలలేదు. రాజు సూసైడ్​ చేసుకున్న చోటు స్టేషన్​ ఘన్​పూర్​కు మూడున్నర కిలోమీటర్లు, నష్కల్​ రైల్వే స్టేషన్​కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే నిందితుడు ఉదయం కృష్ణా ఎక్స్​ప్రెస్​​లో స్టేషన్​ ఘన్​పూర్​ వరకు వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ ట్రాక్​ పై వచ్చి ఉంటాడన్న వాదనలు ఉన్నాయి. దారిలో ఉన్న  సీసీ కెమెరాలకు చిక్కకుండా రాజు ట్రాక్‌ వరకు ఎలా వచ్చాడని పలువురు అనుమానం 
వ్యక్తం చేస్తున్నారు.  


రాయితో కొట్టబోయిండు
‘‘రైల్వే  పట్టాలను పరిశీలిస్తుండగా రాజవరం రైల్వే బ్రిడ్జి సమీపంలో చింపిరి జుట్టు, మాసిపోయిన బట్టలతో ఉన్న ఓ వ్యక్తిని చూసినం. ఎవరు నువ్వు.. ఇక్కడ ఏం పని.. వెళ్లు.. అని అంటుండగానే కంకర రాయి తీసుకొని కొట్టబోయిండు. భయపడి మాకు ఎందుకులే అని వదిలేసినం. కాలినడకన పట్టాలు పరిశీలించే డ్యూటీ చేస్తూ ముందుకు కదిలినం. అంతలో చిల్పూర్ మండలం గెమ్యతాండకు చెందిన రైతులు గేమ్ సింగ్, రాంసింగ్ వ్యవసాయ బావుల వద్ద పొలం పనులు చేసుకొనేందుకు వచ్చిన్రు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లి ట్రాక్​ పక్కన పొదల్లో దాక్కుండు. అప్పుడే భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే కోణార్క్ ఎక్స్​ప్రెస్​ రావడంతో పట్టాల సమీపంలో చెట్ల పొదల్లో దాగి ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నడు. మేము వెనుకకు వచ్చి చూసినం. స్థానిక రైతులను పిలిపించినం. చేతులపై ‘మౌనిక’ అని పచ్చ బొట్లు ఉండడంతో సైదాబాద్ చిన్నారి అత్యాచార కేసు నిందితుడు రాజుగా అనుమానం వచ్చి డయల్​ 100కు ఫోన్​ చేసినం. పోలీసులు వచ్చి మృతుడ్ని రాజుగా గుర్తించిన్రు’’.
                                                                                                                                                                                     ‑ రైల్వే కీమాన్లు సారంగపాణి, కుమార్


పోలీసులకు చెప్పినం
కోణార్క్ ఎక్స్​ప్రెస్​ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే కీ మాన్లు గట్టిగా అరుస్తూ చెప్పిన్రు. అక్కడికి వెళ్లి చూసినం. కొన్ని రోజులుగా మీడి యా లో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఆరేండ్ల చిన్నారి అత్యాచార నిందితుడి ఆనవాళ్లతో విస్తృతంగా ప్రచారం చేసిన విషయాలు గుర్తు చేసుకొని పోలీసులకు ఫోన్ చేసి వివరాలు చెప్పినం. పోలీసులు వచ్చి డెడ్​బాడీని చూసి నిందితుడు రాజు అని చెప్పిన్రు.                                                                                                 ‑రైతులు భూక్య గేమ్ సింగ్, భూక్య రాంసింగ్ 

పోలీసులే..ఉరికిచ్చి చంపేసిన్రు

యాదాద్రి, వెలుగు: రాజును పోలీసులే ఉరికిచ్చి చంపేశారని అతడి తల్లి వీరమ్మ, భార్య మౌనిక ఆరోపించారు. గురువారం యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో వారు మీడియాతో మాట్లాడారు. ఆదివారమే పోలీసులకు రాజు దొరికాడని, ఎన్​కౌంటర్​ చేయాలంటూ పైనుంచి ఆర్డర్స్​ వచ్చాయంటూ పోలీస్​స్టేషన్​లో పోలీసులు మాట్లాడుకుంటుంటే తాము విన్నామని తెలిపారు. తమను ఈ నెల పదో తారీఖున పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లారని, రాజు దొరికితేనే.. విడిచిపెడతామని  చెప్పారని అన్నారు. అలాంటిది బుధవారం తమతో తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకొని విడిచిపెడ్తున్నట్లు పోలీసులు చెప్పడంతో రాజు దొరికిండని అనుకున్నామని, అదే పోలీసులతో అంటే.. దొరకలేదంటూ తమను ఉప్పల్​ రింగ్​ రోడ్డు వద్ద రాత్రి బస్సు ఎక్కించారని  రాజు తల్లి, భార్య చెప్పారు. తెల్లవారి మూడు గంటలకు అడ్డగూడూరుకు వచ్చామన్నారు. ‘‘పోలీసులు ఒకసారేమో దొరికిండన్నరు. ఇంకోసారేమో దొరకలేదన్నరు. వాళ్లు మాట్లాడుకునేదాన్ని బట్టి ఈ నెల 12 తారీఖునే రాజు దొరికినట్లు మాకు అర్థమైంది” అని తెలిపారు. 
తప్పు చేసి ఉంటే జైల్లో పెట్టాలి కదా..
తన కొడుకు రాజు.. ఆడవాళ్లతో, ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగానే ఉండేవాడని వీరమ్మ తెలిపారు. ‘‘ఆడవాళ్లు ఎవరైనా పలకరించినా.. తలకిందికి వేసుకొని వెళ్లిపోయెటోడు. తాగుడు అలవాటు మాత్రం ఉంది. చిన్నపిల్ల శవం మా ఇంట్ల దొరికిందని నింద వాడిమీద వేసిన్రు. ఆ పిల్లను తీసుకొని పోంగ ఎవరైనా చూసిన్రా? కాని పని చేస్తుంటే ఎవరైనా చూసిన్రా? రైలు కింద పడి రాజు చనిపోయిండని అంటున్నరు. పోలీసులే ఉరికిచ్చి చంపిన్రు” అని ఆమె తెలిపింది. తప్పు చేసి ఉంటే జైల్లో పెట్టి శిక్షించాలి కానీ వీళ్లు చంపుడేంది అని ప్రశ్నించింది. ‘‘పట్నంల నా ఇల్లు కూలగొట్టిన్రు. సొంతూర్ల (జనగామ జిల్లా కొడకండ్ల) కూడా ఏమీ లేదు. నా కొడుకు శవాన్ని నేను ఎక్కడికి తీసుకొని పోవాలే. మీరే చెప్పున్రి? మేమెక్కడికీ రాం.. రాజును చంపినోళ్లే  శవాన్ని పారేసుకోండ్రి” అని వరంగల్​ రావాలంటూ తమ వద్దకు వచ్చిన పోలీసులను ఉద్దేశించి  వీరమ్మ అన్నారు. ఇప్పుడు తాము ముగ్గురం ఆడోళ్ల (పది నెలల మనవరాలు) ఎలా బతకాలని, తమకు  న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

నా బిడ్డకు న్యాయం చేయాలి -రాజు అత్తామామ
తుంగతుర్తి, వెలుగు:  తమ బిడ్డ మౌనికకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని రాజు అత్తమామ కేతిరి యాదమ్మ,  వెంకన్న కోరారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురంలో వారు మాట్లాడుతూ.. నాలుగురోజుల కిందట్నే రాజును పట్టుకున్న పోలీసులు, పైకి మాత్రం పరారీలో ఉన్నట్లు చెప్పారని అన్నారు. తమతో పాటు తమ కూతురు మౌనిక, ఆమె అత్త, బంధువులను పోలీసు స్టేషన్​కు తీసుకపోయిన పోలీసులు బుధవారం ఉప్పల్‌లో వదిలేసి  ఖర్చుల కోసం రూ. 850 ఇచ్చారని వారు పేర్కొన్నారు. గురువారం ఉదయమే రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న సమచారం తెలిసిందన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరికీ భూమి మీద ఉండే అర్హత లేదని, తమ అల్లుడు రాజు తప్పు చేశానన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని చెప్పారు.


సింగరేణి కాలనీలో సంబురాలు
హైదరాబాద్‌, వెలుగు: రేపిస్టు రాజు ఆత్మహత్య చేసుకోవడంతో సింగరేణి కాలనీలో స్థానికులు గురువారం సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చారు. రాజు ఇంటిని కూల్చివేశారు. 
షర్మిల దీక్ష భగ్నం
చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటినంక 1:40 గంటల టైమ్​లో ఆమెను దీక్షా శిబిరం నుంచి లోటస్ పాండ్​లోని ఇంటికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. 
ఆడ పిల్లలకు రక్షణ లేదు: విజయశాంతి 
చిన్నారి కుటుంబాన్ని బీజేపీ నేత విజయశాంతి పరామర్శించారు. ‘‘బాధితులను సీఎం కేసీఆర్‌‌ ఎందుకు పరామర్శించలేదు. కేసీఆర్ హయాంలో ఆడ పిల్లలకు రక్షణ లేదు. సీఎంగా ఉండే అర్హతను కేసీఆర్‌‌ కోల్పోయారు. డబ్బులిచ్చి బాధితుల నోరుమూయిద్దామనుకోవడం కరెక్టు కాదు. ఈ ఘటన, దీనిపై ప్రభుత్వ తీరును ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తాను’’ అని ఆమె చెప్పారు. ‘‘రాజు కోసం రాష్ట్రమంతా వెతికాం. పోస్టర్లు వేశాం. తప్పించుకోలేననే భయంతోనే రాజు ఆత్మహత్యకు చేసుకొని ఉంటాడు”అని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ అన్నారు. 


శవాన్ని చెప్పులతో కొట్టేందుకు స్థానికుల ప్రయత్నం

వరంగల్​, వెలుగు: రేపిస్ట్‌‌ రాజు డెడ్‍బాడీని వరంగల్​లోని ఎంజీఎం మార్చురీలోకి తీసుకెళ్తున్న సమయంలో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. శవాన్ని చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్​ ఎంజీఎం మెయిన్  గేట్​ వద్దకు రాగానే శవాన్ని చెప్పులతో కొట్టబోయారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. డెడ్​బాడీని నష్కల్‍ రైల్వే పట్టాల నుంచి హైదరాబాద్​ మెయిన్​రోడ్డులోని మిల్లు వరకు ట్రాక్టర్​లో  తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌‌లో కాజీపేట జీఆర్‍పీ పోలీసులు మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో ఎంజీఎం మార్చురీకి తెచ్చారు. పోస్టు మార్టం అనంతరం డెడ్​బాడీని ఫ్రీజర్‍లో భద్రపరిచారు. మృతదేహాన్ని తీసుకోడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ఇష్టపడలేదు. రాజు తల్లి, భార్యను  ఒప్పించి.. పోలీస్ వెహికల్ లో ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. అయితే.. అంత్యక్రియల విషయంలో కొద్దిసేపు సందిగ్ధత నెలకొంది. సొంతూరు కొండకండ్ల, వలస వెళ్లిన ఊరు అడ్డగూడురులో అంత్యక్రియలు నిర్వహిస్తే అక్కడివాళ్లు అడ్డుచెప్తారని వరంగల్‍  పోతన శ్మశానవాటికలో నిర్వహించారు.