చరిత్ర ఆనవాళ్లు చెరిగిపోతున్నయ్! కబ్జాకు గురవుతున్న కందకాలు, రాజుల కాలం నాటి బావులు

చరిత్ర ఆనవాళ్లు  చెరిగిపోతున్నయ్! కబ్జాకు గురవుతున్న కందకాలు, రాజుల కాలం నాటి బావులు
  • నడిగడ్డలో కబ్జాకు గురవుతున్న కందకాలు, రాజుల కాలం నాటి బావులు
  • చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు కలెక్టర్  ఆదేశాలు
  • నెలలు గడుస్తున్నా డీపీఆర్  ఊసెత్తని ఆఫీసర్లు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని చారిత్రాత్మక కట్టడాల ఆనవాళ్లు క్రమంగా చెరిగిపోతున్నాయి. ఆఫీసర్లు, ప్రభుత్వం వాటిపై ఫోకస్  పెట్టకపోవడంతో రాజుల కాలం నాటి కందకాలు కబ్జాకు గురవుతున్నాయి. పురాతన బావులు బోసిపోతున్నాయి. కోట గోడ కూలిపోతోంది. కలెక్టర్  సంతోష్​ ఈ ఏడాది మార్చి 4న ఫీల్డ్  విజిట్  చేసి చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గద్వాల కోట, లింగం బావి స్టెప్  వెల్  పునరుద్ధరణకు డీపీఆర్​ రెడీ చేయాలని ఆదేశించినప్పటికీ, అడుగు ముందుకు పడలేదు. 

గద్వాల కోటకు కొన్ని వందల ఏండ్ల చరిత్ర ఉందని, అలాంటి కోట గోడను కాపాడుకుంటే రాష్ట్రంతో పాటు దేశంలోనే గద్వాల ప్రాంతానికి మంచి పేరు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పురాతన కట్టడాలను పరిరక్షించకపోతే భవిష్యత్తు తరాలకు చరిత్ర తెలియకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి స్వార్థంతో ఇప్పటికే పురాతన కట్టడాలు, స్థలాలు కనుమరుగైపోయాయని, ఉన్న వాటిని కాపాడాలనే డిమాండ్  వినిపిస్తోంది.

గద్వాల కోటకు వందల ఏండ్ల చరిత్ర..

కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉండే నడిగడ్డ సంగమం దాదాపు 800 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. గద్వాలలో నడిబొడ్డున పెద్ద సోమభూపాలుడు(నల్ల సోమనాద్రి) 1663లో గద్వాల కోట గోడను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 21 బురుజులు, 20 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో గద్వాల కోటను వృత్తాకారంలో నిర్మించారు. కోట గోడను దాటి శత్రువులు ఎవరు లోపలికి రాకుండా కోట చుట్టూ 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతు రాతి కట్టడంతో కందకాలు ఏర్పాటు చేశారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న గద్వాల కోట కూడా నేడు శిథిలావస్థకు చేరింది.

కబ్జా కోరల్లో పురాతన బావులు..

రాజుల కాలంలో గద్వాలలో రాతి కట్టడంతో పురాతన బావులు కట్టారు. చొక్కామ్మ బావి, లింగమ్మ బావి, కొత్త బావి, దొర బావి, పూల బావి, చేపల బావులు రాతి కట్టడంతో అప్పటి రాజులు నిర్మించారు. వీటిలో  పూల బావి కనుమరుగైపోగా, కొత్త బావి కబ్జాకు గురైంది. చేపల బావి, దొర బావి అస్తవ్యస్తంగా మారాయి. వాటిని పరిరక్షించి పునరుద్ధరిస్తే మంచి టూరిస్ట్  ప్లేస్ గా మారే అవకాశాలున్నప్పటికీ, ఎవరూ పట్టించుకోకపోవడంతో బావులు క్రమంగా అన్యాక్రాంతమైపోతున్నాయి. 8 నెలల కింద గద్వాల కలెక్టర్  సంతోష్  ఆఫీసర్లతో కలిసి ఫీల్డ్ విజిట్  చేసి చారిత్రాత్మక కట్టడాలను పునరుద్ధరించి భవిష్యత్తు తరాలకు అందించాలని సూచించారు. పునరుద్ధరణ కోసం డీపీఆర్  రెడీ చేయాలని ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు అధికారులు డీపీఆర్​ తయారు చేయలేదు.

కట్టడాలను కాపాడాలి..

గద్వాలలో ఉన్న ప్రాచీన, చారిత్రాత్మక కట్టడాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గద్వాల చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియాలంటే, వారసత్వ, ప్రాచీన సంపదలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.- బోరవెల్లి పవన్  కుమార్, తెలుగు లెక్చరర్

చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షిస్తాం..

గద్వాలలోని చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించేందుకు చర్యలు చేపడతాం. డీపీఆర్  తయారీపై ఉన్నతాధికారులతో మాట్లాడతాను. కందకాలు కబ్జా కాకుండా చూస్తాం. పురాతన బావులపై ఫోకస్  పెడతాం. -జానకీరాం సాగర్, మున్సిపల్​ కమిషనర్, గద్వాల