ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య కన్నుమూత

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య కన్నుమూత
  •     తెలంగాణ హిస్టరీని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా గుర్తింపు
  •     సంతాపం తెలిపిన మాజీ సీఎం కేసీఆర్​

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రముఖ కవి, -రచయిత డాక్టర్ జైశెట్టి రమణయ్య(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం జగిత్యాలలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

1939లో జైశెట్టి శివానందం, గంగుబాయి దంపతులకు జన్మించిన రమణయ్య 1971లో సిద్దిపేట జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌‌గా పనిచేశారు. అక్కడ చదువుకుంటున్న కేసీఆర్‌‌కు పాఠాలు చెప్పారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు క్షేత్రస్థాయి పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన తెలంగాణ చరిత్రను, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా దేవాలయాల చరిత్రను వెలుగులోకి తీసుకురావడంలో విశేష కృషి చేశారు.

‘సౌత్ ఇండియా టెంపుల్స్’ అనే పరిశోధన గ్రంథంతో పీహెచ్‌‌డీ పొందిన రమణయ్య చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన అరుదైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

జగిత్యాలలో తొలి డాక్టరేట్ పొందిన పరిశోధకుడిగా కూడా పేరొందారు. ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం, ‘కరీంనగర్ జిల్లా చరిత్ర పితామహుడు’ అనే గౌరవాలు లభించాయి. రమణయ్య అంత్యక్రియలు ఈ నెల 29న నిర్వహించనున్నారు.

కేసీఆర్ సంతాపం..

జైశెట్టి రమణయ్య మృతిపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడిగా ఉన్న రమణయ్యతో ఉన్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు.

సిద్దిపేటలో లెక్చరర్‌‌గా ఉన్న సమయంలో తాను ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఆయన వద్ద చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.