కాంగ్రెస్​లో సేవాదళ్​పాత్ర కీలకం

కాంగ్రెస్​లో సేవాదళ్​పాత్ర కీలకం

భారత జాతీయ కాంగ్రెస్‌‌లోని ఐదు గ్రాస్​రూట్​ సంస్థల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ఒకటి.  సేవాదళ్​ ఈ లోక్‌‌సభ ఎన్నికల సంవత్సరం 2024లో తన శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది జులై వరకు వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.1923లో ఆంధ్రప్రదేశ్‌‌లో జరిగిన కాకినాడ కాంగ్రెస్ సమావేశంలో బ్రిటిష్ వారిపై పోరాడేందుకు శ్రీమతి సరోజినీ నాయుడు దేశంలోని మొట్టమొదటి యువజన సంస్థ, హిందుస్థానీ సేవాదళ్‌‌ను ప్రతిపాదించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో అనేకమంది అగ్రనేతలను బ్రిటిష్ వారు జైలులో పెట్టినప్పుడు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించడానికి ఒక స్వచ్ఛంద దళాన్ని కలిగి ఉండాలనే ఆలోచన వచ్చింది.

అనంతరం, డిసెంబరు 28, 1923న డాక్టర్ నారాయణ్ సుబ్బారావు హార్దికర్ నేతృత్వంలో కాంగ్రెస్ సేవాదళ్​గా దీని పేరు మార్చారు. హార్దికర్ 1889 మే 7న ధార్వాడ్‌‌లో జన్మించాడు.  ఆయన ఆగస్టు 26, 1975న తుది శ్వాస విడిచారు.   సుబ్బారావు, యమునాబాయి..స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ రాజకీయ నాయకుడైన నారాయణ్​ సుబ్బారావు హార్దికర్​ తల్లిదండ్రులు. ఆయన కోల్‌‌కతాలోని కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్‌‌లో వైద్య విద్యను అభ్యసించాడు. అనంతరం ఉన్నత విద్య కోసం యునైటెడ్ స్టేట్స్‌‌కు వెళ్లాడు. తన చదువు పూర్తి చేసిన తర్వాత హార్దికర్​ 1921లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.

హార్దికర్​, హెడ్గేవార్​ సహ విద్యార్థులు

డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, డాక్టర్ నారాయణ్ సుబ్బారావు హార్దికర్ సహ విద్యార్థులు. రాజకీయంగా కలిసి ఉన్నప్పటికీ భిన్న రాజకీయ భావజాలం కారణంగా వారు భిన్న ధ్రువాలుగా విడిపోయారు. హార్దికర్‌‌ను మహాత్మా గాంధీ ప్రభావితం చేయగా, ఆర్ఎస్ఎస్​  వ్యవస్థాపకుడు హెడ్గేవార్ హిందువులు, హిందూ రాష్ట్ర ఐక్యతపై దృష్టి సారించారు. ఎన్నో సంవత్సరాలుగా, సేవాదళ్ సభ్యులు తెల్లటి దుస్తులు, గాంధీ టోపీ సంప్రదాయంగా ధరిస్తున్నారు.

సేవాదళ్​ సభ్యులు వారి ప్రధాన సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రాజకీయాల కంటే పార్టీ  ఉత్సవ కార్యక్రమాలకు, స్వచ్ఛంద సేవలకు ఎక్కువగా తమ సేవలు అందించారు. సేవాదళ్ ఏర్పడిన అనంతరం ప్రారంభ నుంచి జాతీయ జెండా సంరక్షకునిగా సంస్థ మారింది. నేటికీ ప్రతి నెల చివరి ఆదివారం నాడు సేవాదళ్​ ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం జరుగుతోంది. అయితే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట రాజకీయ, నామినేటెడ్ పదవులు పొందగలిగే కొందరిని విస్మరించడంతో సభ్యుల్లో అసంతృప్తి నెలకొంది. కానీ చాలామంది సభ్యులు నేటికీ సేవాదళ్​ భావజాలానికి కట్టుబడి ఉన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో సేవాదళ్ ​కీలకపాత్ర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే కాకుండా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ సేవాదళ్ చురుకుగా ఉంది. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవంతోపాటు ఇతర ప్రధాన జాతీయ కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలలో  సేవాదళ్ వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొని గాంధీభవన్‌‌లో చురుకుగా వ్యవహరిస్తారు. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్‌‌గా తారిఖ్ అన్వర్‌‌ను నాటి ప్రధాని, ఏఐసీసీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ నియమించారు. తారిఖ్ అన్వర్ ఏపీ సేవాదళ్ చైర్మన్‌‌గా ఎంఏ ఖాన్‌‌ను నియమించారు. 13 ఏండ్ల పాటు పనిచేసి విస్తృత సేవలు అందించిన ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగానూ రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. ఎంఏ ఖాన్, కనుకుల జనార్దన్ రెడ్డి వంటి పలువురు సేవాదళ్ నాయకులు తమ సేవలకు గుర్తింపుగా రాజకీయ నామినేట్​ పదవులను కూడా పొందారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ బెర్త్‌‌లుతో సహా ఇతర పదవులు పొందారు. 

 దేశవ్యాప్తంగా​శతాబ్ది ఉత్సవాలు

“ఆలిండియా కాంగ్రెస్ సేవాదళ్ ఈ సంవత్సరం దక్షిణాదితో సహా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమైన సేవాదళ్​కు ఇది ఒక ముఖ్యమైన సందర్భం. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీ లాల్జీ దేశాయ్, ఆయన బృందం ఆధ్వర్యంలో  కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్యూలో చివరిలో నిల్చున్న వ్యక్తి అవసరాలను కూడా తీరుస్తూ,  రాజ్యాంగ విలువలను కాపాడుతూ భారతదేశాన్ని సూపర్ పవర్‌‌గా తీర్చిదిద్దుతామని వాగ్దానం’’ అని సేవాదళ్ కోశాధికారి, సౌత్ జోన్ ఇన్‌‌ఛార్జ్‌‌గా కొత్తగా నియమితులైన కనుకుల జనార్దన్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌‌లో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌‌రెడ్డి దక్షిణాది సేవాదళ్‌‌ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు కేరళలోని సేవాదళ్ ముఖ్య నాయకులు హాజరయ్యారు "సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు జులై 2024 వరకు కొనసాగుతాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే  దేశంకోసం విరాళం ఇచ్చే క్రౌడ్ ఫండింగ్  ప్రారంభించారు". అని ఆయన వెల్లడించాడు. జనార్దన్ రెడ్డితో పాటు వెస్ట్ జోన్‌‌కు సత్యేంద్ర యాదవ్‌‌, నార్త్ జోన్‌‌కు నరేంద్ర బాతీష్‌‌ను ఇన్​చార్జ్​లుగా ఏఐసీసీ నియమించింది. దేవవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సేవాదళ్ చాప్టర్లు ఉన్నాయి.

సేవాదళ్​కు అధ్యక్షత వహించిన గాంధీ

‘మహాత్మాగాంధీ 1931లో సేవాదళ్‌‌ను కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌‌గా గుర్తించారు. గాంధీ స్వయంగా సేవాదళ్ సమావేశానికి అధ్యక్షత వహించారు’  అని కర్ణాటక సేవాదళ్ ఇన్‌‌చార్జ్, సీనియర్ నాయకుడు బలరామ్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాత స్థాపించబడిన ఆర్​ఎస్​ఎస్​ ఇప్పుడు ‘సంఘ్ పరివార్‌‌’లో బలమైన, కీలకమైన సంస్థగా అవతరించింది. కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ గణనీయమైన ప్రభావాన్ని  కలిగి ఉంది. కానీ, కాంగ్రెస్ సేవాదళ్ విషయంలో అలా కాదు. కాంగ్రెస్​ పార్టీపై సేవాదళ్​ రాజకీయ అంశాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపలేదు. కానీ, బలరామ్ సింగ్ ఇలా అంటాడు, “అప్పుడు, ఇప్పుడు..సేవాదళ్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన ఫ్రంటల్ సంస్థలలో ఒకటిగా ఉంది’  అన్నారు. 

బ్రిటిష్ ​వారిపై పోరాటమే లక్ష్యం

1923లో జెండా సత్యాగ్రహం సమయంలో హార్దికర్ ఆయన హుబ్లీ సేవా మండల్ బ్రిటిష్ అధికారులకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో జాతీయ దృష్టిని ఆకర్షించారు. సేవా మండల్​ జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించింది.  బ్రిటిష్ వారితో పోరాడటానికి స్వచ్ఛంద సేవకుల బృందాన్ని రూపొందించడానికి హుబ్లీ సేవా మండల్ తరహాలో ఒక సంస్థను స్థాపించడానికి కాంగ్రెస్‌‌ను ప్రేరేపించింది. 1923 నాటి కాకినాడ కాంగ్రెస్ సమావేశంలో అటువంటి సంస్థను స్థాపించడానికి హార్దికర్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. హిందుస్థానీ సేవా మండల్ 1923లో ఏర్పడింది. ఆ తరువాత సేవాదళ్‌‌గా పేరు మార్చబడింది. డాక్టర్ హార్దికర్ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. పండిట్ జవహర్‌‌లాల్ నెహ్రూ దాని మొదటి ప్రెసిడెంట్‌‌గా ఎన్నికయ్యారు, తరువాత నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. వీరితోపాటు మౌలానా సౌకత్ అలీ, వి సాంబమూర్తి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సహా పలువురు ప్రముఖ నాయకులు ఉన్నారు.

తెలంగాణలోనూ..

దేశంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ సేవాదళ్ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ శతాబ్ది ఉత్సవాల కోసం రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు, సేవాదళ్ సాహిత్య ప్రచురణ, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను అన్ని వర్గాల ప్రజలకు ప్రచారం చేయడం, సీనియర్ సేవాదళ్ సభ్యులకు సన్మానం, కాంగ్రెస్ పార్టీ ప్రచారం వ్యాప్తి వంటి కార్యక్రమాల శ్రేణిని రూపొందించింది. ప్రజలకు కార్యక్రమాలు, విధానాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని వర్గాలను యాక్టివేట్​ చేయడం, పౌరుల ప్రాథమిక హక్కుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడం, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రతో ప్రజలను కనెక్ట్ చేయడంలో సేవాదళ్ కీలకంగా వ్యవహరిస్తోంది. 

- సీఆర్​ గౌరీశంకర్,
సీనియర్​ జర్నలిస్ట్.