HIT 3OTT: మే 1న థియేటర్లలోకి.. మే 29న ఓటీటీలోకి.. హిట్-3 సినిమాకు ఏంటీ పరిస్థితి..?

HIT 3OTT: మే 1న థియేటర్లలోకి.. మే 29న ఓటీటీలోకి.. హిట్-3 సినిమాకు ఏంటీ పరిస్థితి..?

శైలేష్ కొలను, నాని కాంబోలో వచ్చిన హిట్-3 థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. మే 1, 2025న థియేటర్లలో విడుదలైన హిట్-3 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ను నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. హిట్-3 సినిమా మే 29న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ ‘ఎక్స్’ వేదికగా ఈ ప్రకటన చేసింది. ప్రస్తుత సినిమాల పరిస్థితి ఎలా మారిపోయిందంటే.. 50 డేస్ అటుంచి.. హిట్ టాక్ వచ్చిన సినిమా కూడా గట్టిగా నెల రోజులు థియేటర్లలో ఆడటం లేదు. హిట్-ది థర్డ్ కేస్ సినిమానే ఇందుకు నిదర్శనం. హిట్-3 సినిమాకు హిట్ టాక్ వచ్చింది. తొలి రెండు వారాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది.

ఓవరాల్గా హిట్-3 సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని ఇండస్ట్రీ కోడై కూసింది. సినిమా టీం కూడా హిట్-3 సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిందని చెప్పుకొచ్చింది. ఇంత బజ్ నడిచిన హిట్-3 సినిమా కూడా 4 వారాల థియేట్రికల్ రన్తోనే చాప చుట్టేసింది. అయితే.. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదని.. ప్రస్తుతం ఎంత మంచి టాక్ వచ్చినా తెలుగు సినిమాలు 28 రోజులకే.. అంటే నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీ్మ్ అవుతున్నాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

నూటికి 90 శాతం తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్నాయని గుర్తుచేశారు. అసలే.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి అంతం మాత్రంగా ఉంది. లాభాల మాట అటుంచితే సినిమా టాక్ తేడాగా ఉంటే షోస్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, పరిస్థితులు ఇలానే కొనసాగితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసుకోక తప్పదని టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘‘హిట్-3’’ ఓటీటీ స్ట్రీమింగ్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఏదేమైనా.. సగటు ప్రేక్షకుడికి ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేదు. హిట్-3 సినిమా మే 29న ఓటీటీకి వచ్చేస్తోంది. ఇంట్రస్ట్ ఉన్న ఆడియన్స్ హ్యాపీగా చూసేయండి.