లక్షా 20 వేల గజాల సర్కార్ భూములకు అర్రాస్ 

లక్షా 20 వేల గజాల సర్కార్ భూములకు అర్రాస్ 

నోటిఫికేషన్​ విడుదల చేసిన హెచ్ఎండీఏ
జనవరి 16 వరకు రిజిస్ట్రేషన్లు 
రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల అమ్మకం 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో సర్కార్ భూముల అర్రాస్​కు హెచ్‌‌‌‌ఎండీఏ బుధవారం నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. 300 గజాల నుంచి 10 వేల గజాల వరకు ఉన్న మొత్తం 1,20,279 గజాల ప్లాట్లను వేలానికి పెట్టింది. ఇందుకు సంబంధించి జనవరి 4,5,6 తేదీల్లో ప్రీబిడ్‌‌‌‌ సమావేశాలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. రిజిస్ట్రేషన్‌‌‌‌కు 2023 జనవరి 16 తుది గడువుగా నిర్ణయించింది. ఈఎండీ చెల్లింపునకు అదే నెల17 వరకు గడువు విధించింది. 18న భూముల వేలం ప్రక్రియ చేపట్టనుంది. గతంలో కూడా ప్రభుత్వం భూములను అమ్మి, భారీగా ఆదాయం సమకూర్చుకుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని పుప్పాలగూడ, బైరాగిగూడ, మంచిరేవుల, పీరం చెరువు, కోకాపేట, శేరిలింగంపల్లి పరిధి నల్లగండ్లలోని వివిధ సర్వే నంబర్లలో కలిపి 53,883 చదరపు గజాల భూములను వేలానికి పెట్టారు.

ఈ ప్రాంతంలో చదరపు గజానికి కనీస ధరను రూ.35 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇస్నాపూర్, ఆర్​సీ పురం పరిధిలోని వెలిమెల, జిన్నారం పరిధిలోని మేడారం, అమీన్ పూర్, పటేల్ గూడ, సుల్తాన్ పూర్ పరిధిలో 41,170 చదరపు గజాలను అమ్మకానికి పెట్టారు. ఈ ప్రాంతాల్లో చదరపు గజానికి కనీస ధరను రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు నిర్ణయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బాచుపల్లి, మూసాపేట(కూకట్ పల్లి), బౌరంపేట(గండిమైసమ్మ), సూరారం(కుత్బుల్లాపూర్), కొర్రెముల(ఘట్ కేసర్) పరిధిలోని 25,226 చదరపు గజాల భూములను వేలానికి పెట్టగా, ఆయా ప్రాంతాల్లో గజానికి కనీస ధరను రూ.20 వేల నుంచి రూ.70 వేలుగా నిర్ణయించారు.