ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు చేపట్టని హెచ్ఎండీఏ

ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు చేపట్టని హెచ్ఎండీఏ

హైదరాబాద్, వెలుగు: ఓఆర్ఆర్(ఔటర్ రింగ్ రోడ్డు) సర్వీస్​రోడ్లను హెచ్ఎండీఏ పట్టించుకోవడం లేదు. ఆదాయం వచ్చే ఔటర్ పై మాత్రమే ఫోకస్​పెడుతోంది. ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చి14 ఏండ్లు గడిచినా ఇప్పటికీ సర్వీస్​రోడ్లపై వాహనదారులు సాఫీగా ప్రయాణించలేకపోతున్నారు. ఒకటి, రెండు చోట్ల మినహా ఎక్కడా రోడ్లను విస్తరించడం లేదు. ఔటర్ పై దగదగలాడే ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసిన అధికారులు సర్వీస్​రోడ్లను గాలికి వదిలేశారు. చీకటి పడితే అటుగా వెళ్లలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఒకేరూట్​లో రాకపోకలు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత డేంజర్​గా ఉంటోంది. ట్రాఫిక్ నిలుస్తోంది. ముందు వెళ్తున్న వెహికల్​ను ఓవర్​టేక్​చేసే అవకాశం ఉండడం లేదు. అలాంటి చోట్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొత్తం 158 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ విస్తరించి ఉండగా, నేటికీ కొన్ని ప్రాంతాల్లో ఇరువైపులా సర్వీస్​రోడ్లు లేవు. మహేశ్వరం, కండ్లకోయ రోడ్, ఘట్ కేసర్ రోడ్ సమీపంలో, శంషాబాద్, హిమాయత్ సాగర్ తదితర ప్రాంతాల్లో ఒకవైపే సర్వీస్​రోడ్డు ఉంది. రాకపోకలు దాని గుండానే సాగుతున్నాయి.

సైన్​బోర్డుల్లేవ్​

నార్సింగి నుంచి అప్పా జంక్షన్ వెళ్లే రూట్లో రోడ్డు వైడనింగ్ పనులు జరుగుతున్నాయి. చీకటి పడ్డాక ఇటుగా వెళ్లాలంటే పెద్ద సవాల్ గా ఉంటోంది. అలాగే సర్వీస్ రోడ్డు కంటిన్యుటీ లేని ప్రాంతాల్లో సరైన సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఆ విషయం తెలియక వాహనదారులు రోడ్​డెడ్​ఎండ్ వరకు వెళ్లి వెనక్కి వస్తున్నారు. హిమాయత్ సాగర్ లో డైలీ 300 వాహనాలు సర్వీసు రోడ్డు లేదన్న విషయం తెలియక దాదాపు 650 మీటర్లు వెళ్తున్నాయి. అక్కడ డెడ్​ఎండ్ అని ఉన్న చిన్న బోర్డును చూసి తిరిగి వస్తున్నాయి. ఆ బోర్డు కూడా కనిపించీ కనిపించనట్లు చెట్ల మధ్యలో ఉంది. ఈ ఒక్కచోటే కాదు ఓఆర్ఆర్​చుట్టూ ఇదే పరిస్థితి ఉంది. రాత్రిళ్లు చివరి దాకా వెళ్లి తిరిగి రావడం కష్టంగా ఉంటోందని వాహనదారులు వాపోతున్నారు. ఉన్న లైట్లు వెలగట్లేదని, కొన్నిచోట్ల మొత్తానికే లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లైటింగ్, సైన్​బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

రాబడిపైనే ఫోకస్​

ఆదాయంపై ఫోకస్​పెడుతున్న హెచ్ఎండీఎ అధికారులు సర్వీస్​రోడ్లను మొత్తానికే పట్టించుకోవడం లేదు. కంటిన్యుటీ లేనిచోట భూసేకరణ చేసి రోడ్లను పూర్తి చేయలేకపోతుంది. అన్నిచోట్ల ఇరువైపులా సర్వీసు రోడ్డు ఉంటే ఓఆర్ఆర్ పైన ప్రయాణించే వారితో పాటు కింది నుంచి వెళ్లే వారికి ఎలాంటి సమస్య ఉండదు.