వనమహోత్సవం టార్గెట్ .. నాలుగున్నర కోట్ల మొక్కలు .. నాటనున్న హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ

వనమహోత్సవం టార్గెట్ .. నాలుగున్నర కోట్ల మొక్కలు .. నాటనున్న హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ
  • అర్బన్​ఫారెస్ట్​పార్కులుగా అర్బన్​ఫారెస్ట్​ బ్లాక్​లు 
  • 189 బ్లాకుల్లో ఇప్పటికే 17 పార్కులు పూర్తి  
  • మొత్తం 45 పార్కుల చేయాలని నిర్ణయం  

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో పచ్చదనం పెంచడంపై హెచ్ఎండీఏ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఔటర్ రింగ్​రోడ్, నేషనల్​హైవేస్, ట్రిపుల్​ఆర్​వరకు ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని విస్తరించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. త్వరలో నిర్వహించనున్న వనమహోత్సవంలో భాగంగా 4.5 కోట్ల మొక్కలు నాటాలని అర్బన్ ఫారెస్ట్రీ ఆఫీసర్లు ప్రణాళికలు రచిస్తున్నారు. గతేడాది వనమహోత్సవం కింద 6.8 కోట్ల మొక్కలు నాటామని, ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈసారి 4.5 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.  వన మహోత్సవం కోసం 42 హెచ్ఎండీఏ నర్సరీల్లో వివిధ రకాలకు చెందిన 5 కోట్ల మొక్కలు పెంచుతున్నట్టు తెలిపారు. 

మొక్కలు నాటడంతో పాటు పంపిణీ కార్యక్రమాల్లో బల్దియా, టీజీఐఐసీ, ఎఫ్డీసీ, మెట్రోరైల్​వంటి సంస్థలను భాగస్వామ్యం చేయనుంది. వన మహోత్సవం కోసం కోర్​అర్బన్​ఏరియాలతో పాటు హైదరాబాద్​చుట్టుపక్కల ప్రతి సంవత్సరం 5 నుంచి 6 కోట్ల మొక్కలను పెంచుతున్నట్టు హెచ్ఎండీఏ అర్బన్​ఫారెస్ట్రీ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో స్థానిక జాతులతో పాటు, వివిధ రకాల పూలు, అటవీ మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు ఉన్నాయంటున్నారు. ఇండ్లలో పెంచుకునే పూల మొక్కలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. 

నగరం చుట్టూ అర్బన్​ ఫారెస్ట్​ పార్కుల అభివృద్ధి

నగరం చుట్టూ ఉన్న అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లను కూడా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ పార్కులు గా అభివృద్ధి చేయనున్నది. నగరం చుట్టూ వివిధ ప్రాంతాల్లో 189 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లు ఉండగా, 45 బ్లాక్ లను పార్కులుగా డెవలప్​చేస్తున్నామని, వీటిలో 17 పార్కులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. దశల వారీగా వీటిని అభివృద్ధి చేస్తామంటున్నారు. అర్బన్ ఫారెస్ట్​పార్కులను అభివృద్ధి చేయడం వల్ల ప్రజలకు విహార కేంద్రాలుగా ఉపయోగపడతాయని, ఫ్యామిలీతో వెళ్లి గడపడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.