జైల్లో నాకేం జరిగిన మునీరే కారణం.. టెర్రరిస్ట్ కంటే ఘోరంగా చూస్తున్నరు: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

జైల్లో నాకేం జరిగిన మునీరే కారణం.. టెర్రరిస్ట్ కంటే ఘోరంగా చూస్తున్నరు: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‎పై సంచలన ఆరోపణలు చేశారు. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. జైల్లో  తనకు ఏదైనా హాని జరిగితే దానికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీరే కారణమని ఆరోపించారు. దానికి అతడే బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు పీటీఐ పార్టీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు ఇమ్రాన్. 

‘‘జైలులో తనకు ఏదైనా హాని జరిగితే దానికి ఆర్మీ చీఫ్‌ మునీర్‎ను నేరుగా జవాబుదారీగా ఉంచాలని పార్టీ కార్యకర్తలను స్పష్టంగా ఆదేశిస్తున్నా. జైలు జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఎప్పటికీ నిరంకుశత్వానికి తలొగ్గను’’ అని పేర్కొన్నారు ఇమ్రాన్. ఇమ్రాన్ ఖాన్‎ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 2025, ఆగస్ట్ 5 నుంచి దేశవ్యాప్త నిరసనలకు పీటీఐ సిద్ధమవుతోంది.  ఈ క్రమంలో ప్రతి పార్టీ సభ్యుడు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఈ నిరసనలో చేరాలని ఇమ్రాన్ విజ్ఞప్తి చేశారు.

నా సందేశాలను సోషల్ మీడియాలో రీట్వీట్ చేసి నా గొంతును విస్తృతం చేయండని పిలుపునిచ్చారు. ఇక జైల్లో తన భార్య బుష్రా బీబీ, తన పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సైనిక అధికారి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ అనుభవిస్తున్నాడు. దోషులుగా తేలిన ఉగ్రవాదుల కంటే కూడా తనను దారుణంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్లు ఎన్ని అణిచివేతలకు గురిచేసిన నేను మాత్రం తలవంచలేదు.. ఎప్పటికీ తలవంచబోనని తేల్చి చెప్పారు. 

తన భార్య సెల్‎లోని టీవీని కూడా ఆపేశారని. జైల్లో మా ఇద్దరికీ అన్ని ప్రాథమిక హక్కులు నిలిపేశారని ఆరోపించారు. జైలు సూపరింటెండెంట్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ ఆదేశాల మేరకు పని చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. తన పదవీకాలంలో అసిమ్ మునీర్‎ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించినప్పుడు అతడు తన భార్య ద్వారా లాబీయింగ్ చేయాలని ప్రయత్నించాడు. 

కానీ అసిమ్ మునీర్‎ను కలవడానికి ఆమె తీవ్రంగా నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి తన భార్యపై అసిమ్ మునీర్ వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడని ఇమ్రాన్ పేర్కొన్నాడు. పంజాబ్ సీఎం మరియం నవాజ్, మంత్రి మొహ్సిన్ నఖ్వీ గత రెండేళ్లుగా పంజాబ్‎లో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు.