పల్లెల్లో జాజిరి..జాజిరి

V6 Velugu Posted on Mar 25, 2021

హోలీ అనంగనే పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ల వరకు మస్తు సంబరపడతరు. రంగులు పూసుకుని ఎంజాయ్‌‌ చెయ్యొచ్చని ఖుషి అయితరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ల వరకు అందరూ కలిసి ఆనందంగా చేసుకునే రంగుల పండుగ ఇది.  పల్లెల్లో ఈ పండుగకు నెల రోజుల ముందు నుంచే సంబురాలు మొదలైతయ్‌‌​.  గోగుపూలు తెచ్చి రంగు చేయడం, రాత్రిపూట కోలలు ఆడటంతో సంబురాలు మొదలవుతాయి. ఒక్కో దగ్గర ఒక్కో తీరుగా ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. 

పల్లెల్లో జాజిరి ఆటలు మొదలైనయ్​ రోజూ సాయంత్రం కోలల చప్పుళ్ళతో జాన పదాలు వినిపిస్తున్నయ్‌‌. కాముడి ఆటలు షురూ అయ్యాయి. హోలీకి తొమ్మిది రోజుల ముందు నుంచే పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సంబురాలు చేసుకుంటారు. ఈ పాటల్లో జాజిరి పాటలు ప్రత్యేకం. అవి తెలంగాణ కల్చర్​కి నిదర్శనంగా నిలుస్తాయి. 
“ రింగురింగు బిళ్ల రూపాయి దండా.. దండ కాదురా తామర మొగ్గ...’’
“ ఆ గుండు ఈ గుండు ఇత్తడి గుండు.. గుండువోయి గండిమీద మోతలు పెట్టి....’’
“కోతి పుట్టుడెందుకు కొమ్మలెక్కెటందుకు” 
అంటూ పిల్లలు పాడుతూ తిరుగుతుంటరు. హోలీకి ముందు  తొమ్మిది రోజుల పాటు పిల్లలు, పెద్దలు అందరూ ఆడే కాముడి ఆటలతో ఊరు, వాడ హోరెత్తుతాయి. 

అనాదిగా వస్తున్న ఆచారం..

మగపిల్లలు కోలలతో, ఆడపిల్లలు చప్పట్లతో పాటలు పాడుతూ ఇంటింటికీ తిరుగుతూ ఆడుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇంటింటికీ వెళ్లి వడ్లు, మక్కలు, బియ్యం సేకరిస్తారు. వాటిని అమ్ముకుని,  వచ్చిన డబ్బులతో తెల్లారి హోలీ జరుపుకుంటారు. జాజిరి ఆట చివరి రోజు గ్రామ కూడలిలో కామ దహనం చేస్తారు. అప్పుడు మగపిల్లలు కోలలు, ఆడపిల్లలు పిడకలను మంటల్లో వేస్తారు. 

లంబాడీలకు ప్రత్యేకం

హోలీ పండుగను లంబాడీలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. వారం  రోజుల ముందు నుంచే 'గేర్ వగావో' ఆడుతారు. అంటే.. బతుకమ్మ ఆటలాగా పాటలు పాడుతూ ఆట ఆడతారు. ఇంటింటికీ తిరిగి చందాలు వసూలు చేసి.. ఆ డబ్బుతో మేకపోతులు కొని హోలీ రోజున తండా పెద్ద (నాయక్) ఇంటి దగ్గర బలిస్తారు. తర్వాత డాన్సులు చేసి సొళాయి (నల్ల)  వండుకుని తింటారు. ఇందులో ప్రత్యేకమైన మరో ఆచారం కూడా ఉంది. తండాలో సంతానం లేని ఆడవాళ్లు తండా పెద్దల ఇళ్ల ముందు పాటలు పాడి నృత్యం చేస్తారు. అప్పుడు ఆ ఇంటి యజమాని ‘సంతానం కలుగు గాక’ అని దీవిస్తే పిల్లలు పుడతారని వారి నమ్మకం. హోలీ పండుగకు ముందు రోజు రాత్రి పది గంటల నుంచి కామదహనం చేస్తారు, ఆ బూడిదను దిష్టి తగలకుండా నుదుట పెట్టుకుంటారు.  

Tagged Holi

Latest Videos

Subscribe Now

More News