జియోకు ఎయిర్‌‌‌‌టెల్‌‌ జవాబు

జియోకు ఎయిర్‌‌‌‌టెల్‌‌ జవాబు

న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల రిలయన్స్ జియో లాంచ్ చేసిన బ్రాడ్‌‌బ్యాండ్ గిగాఫైబర్‌‌‌‌కు పోటీగా.. భారతీ ఎయిర్‌‌‌‌టెల్ సరికొత్త బ్రాడ్‌‌బ్యాండ్ ఆఫర్‌‌‌‌ను ప్రకటించింది. ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్ ఫైబర్ పేరుతో నెలకు 1జీబీపీఎస్‌‌ స్పీడ్‌‌లో బ్రాడ్‌‌బ్యాండ్‌‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. దీని ధర నెలకు రూ.3,999గా నిర్ణయించింది. ‘బుధవారం నుంచి ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్ ఫైబర్‌‌‌‌ అన్ని ఇళ్లకు, చిన్న ఆఫీస్‌‌లకు, చిన్న వాణిజ్య సదుపాయాలకు అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ, గూర్గావ్, ఫరిదాబాద్, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, చండీఘర్, ఇండోర్, కోల్‌‌కతా, జైపూర్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్‌‌ ఫైబర్‌‌‌‌ సేవలు లభిస్తాయి’ అని భారతీ ఎయిర్‌‌‌‌టెల్ ప్రకటించింది. వచ్చే కొన్ని నెలల్లో ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్‌‌ ఫైబర్‌‌‌‌ను మరిన్ని మార్కెట్లలోకి తీసుకురానున్నట్టు తెలిపింది.

ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్ ఫైబర్‌‌‌‌పై 1జీబీపీఎస్‌‌ స్పీడ్‌‌లో అన్‌‌లిమిటెడ్ బ్రాడ్‌‌బ్యాండ్, ఇండియాలో ఏ నెట్‌‌వర్క్‌‌కైనా అపరిమిత ల్యాండ్‌‌లైన్ కాల్స్ చేసుకునే అవకాశం, ఎక్స్‌‌క్లూజివ్‌‌గా ‘ఎయిర్‌‌‌‌టెల్ థ్యాంక్స్’ ప్రయోజనాలు లభించనున్నాయి. ఎయిర్‌‌‌‌టెల్ అందించే ప్రయోజనాల్లో నెట్‌‌ఫ్లిక్స్ సబ్‌‌స్క్రిప్షన్ గిఫ్ట్, వన్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌‌‌‌షిప్, జీ5, ఎయిర్‌‌‌‌టెల్‌‌ ఎక్స్‌‌స్ట్రీమ్ యాప్‌‌ నుంచి ప్రీమియం కంటెంట్ పొందే అవకాశముంది. కాగా, ఈ నెల మొదట్లోనే బిలీనియర్ ముఖేష్ అంబానీ తన ఫైబర్ ఆధారిత బ్రాడ్‌‌బ్యాండ్ సేవలను మార్కెట్‌‌లోకి తెచ్చారు. జియో కూడా 1జీబీపీఎస్​ డేటా రూ.3999కే ఆఫర్​ చేస్తోంది.