భోజనం.. తినే ప్రదేశాన్ని బట్టి ధర మారుతుంది.. హోటల్, రెస్టారెంట్ లేదా ఇంట్లో తింటాం.. సహజంగా భోజనం ధరలను ఇంట్లో అయ్యే ఖర్చుతో నిర్థారిస్తాయి ప్రభుత్వాలు.. ఓ పావు కిలో బియ్యం వండుకుంటే ఇంట్లోనే నలుగురు హాయిగా తినేయొచ్చు అనుకుంటారు మధ్య తరగతి, పేద ప్రజలు.. ఎందుకంటే బయట తింటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి.. అయితే ఇప్పుడు ఇంటి భోజనం కూడా చాలా చాలా ఖరీదు అయ్యిందంటూ ప్రమఖ రేటింగ్ ఏజెన్సీక్రిసిల్ సంస్థ వెల్లడించింది.
2023 ఏడాదితో పోల్చితే.. 2024 మార్చి నాటికి.. ఏడు శాతం ఇంటి భోజనం ఖర్చు పెరిగింది. ఇంట్లో ఓ మనిషి.. ఒక పూట తక్కువలో తక్కువ కూరగాయలతో భోజనం చేసినా 27 రూపాయలు అవుతుంది అంట.. అంటే నలుగురు ఉన్న ఓ కుటుంబం.. రెండు పూటల భోజనం చేయాలంటే 240 రూపాయలు అవుతుంది. అదే మూడు పూటల భోజనం చేస్తే 360 రూపాయలు ఖర్చవుతుంది.. ఇది ఒక్క రోజుకు.. అదే 30 రోజులకు లెక్కిస్తే.. 10 వేల 800 రూపాయలు ఖర్చవుతుంది. ఇది కేవలం శాఖాహారం.. అంటే అత్యంత తక్కువ ధరలో.. ఓ రోజు కూరగాయలు, మరో రోజు పచ్చడి మెతుకులతో భోజనం చేస్తేనే అయ్యే ఖర్చు అన్న మాట...
దీనికి కారణం లేకపోలేదు.. మార్కెట్ లో కిలో బియ్యం 70 రూపాయలకు చేరింది.. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి.. దీంతో శాఖాహార ప్లేట్ భోజనం ఖర్చే భారీగా పెరిగినట్లు చెబుతున్నాయి సర్వేలు. భారీగా పెరిగిన భోజనం ఖర్చుతో మధ్య తరగతి, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ప్రైవేట్ ఉద్యోగుల తలసరి సరాసరి జీతం 30 వేల రూపాయల మధ్యనే ఉంది.. ఇలాంటి సమయంలో నెలావారీ భోజనం ఖర్చే 11 వేల రూపాయలకు చేరటం అంటే మామూలు విషయం కాదు.
బియ్యానికి తోడు ఉల్లిపాయలు, టొమాటో, బంగాళదుంపల ధరలు సంవత్సరానికి 40%, 36% , 22% పెరిగినందున శాఖహార భోజన ధర పెరిగిందని సంస్థలు వెల్లడిచాయి. ఇదిలావుంటే ఇంట్లో వండిన మాంసాహార భోజన ధర 7% తగ్గిందని క్రిసిల్ తన సర్వేలో తెలిపింది. మాంసాహార భోజనం ప్లేట్ ధర 7% తగ్గి రూ.59.2 నుంచి రూ.54.9కి చేరినట్లు సర్వేలో వివరించింది.