కరోనాతో ఇంటి బడ్జెట్‌కు చిల్లు పడుతోంది

కరోనాతో ఇంటి బడ్జెట్‌కు చిల్లు పడుతోంది
  •     ఇంటి బడ్జెట్‌కు చిల్లు పడుతోంది
  •     76 శాతం మంది ఇదే మాట
  •     పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరగడంతోనే ఎక్కువ ఇబ్బంది
  •     యుగావ్‌‑మింట్‌‑సీపీఆర్ సర్వేలో వెల్లడి

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఒకవైపు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు, పెరుగుతున్న ఖర్చులు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఇన్‌‌కమ్‌‌ లెవెల్స్‌‌ పెద్దగా పెరగకపోవడంతో  ఇంటి బడ్జెట్‌‌లో మెజార్టీ వాటా ఖర్చులకే పోతోందని ప్రజలు బాధపడుతున్నారు. సేవింగ్స్‌‌, ఇన్వెస్ట్‌‌మెంట్ కోసం కేటాయింపులు చేయడం ఛాలెంజ్‌‌గా మారిందని వాపోతున్నారు.  ఉప్పులు, పప్పులు, బిల్లులు, పెట్రోల్‌‌, డీజిల్‌‌ వంటి ఎసెన్షియల్  ప్రొడక్ట్‌‌ల ధరలు పెరగడంతో  ఎక్కువమంది  ఇబ్బంది పడుతున్నారని యుగావ్‌‌–మింట్‌‌–సీపీఆర్‌‌‌‌ మిలినియల్ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం,  అర్బన్‌‌ ఏరియాల్లో నివసించే వారిలో 76 శాతం మంది ఖర్చులు పెరగడంతో ఇబ్బంది పడుతున్నామని  పేర్కొన్నారు. పెట్రోల్‌‌, డీజిల్ రేట్లు పెరగడంతో తమ ఇంటి బడ్జెట్‌‌కు చిల్లు పడుతోందని మెజార్టీ రెస్పాండెంట్లు చెప్పడం గమనించాలి. తమ ఇంటి ఖర్చులు పెరిగాయని 2020 లో 57 శాతం మంది చెప్పగా, 2‌‌‌‌021 లో ఈ నెంబర్‌‌‌‌ 76 శాతానికి చేరింది.   అత్యవసర ప్రొడక్ట్‌‌లతో పాటు హెల్త్ ఖర్చులు, కూరగాయల ఖర్చులు, ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌ ఖర్చులు  విపరీతంగా పెరిగాయని, రీఛార్జ్‌‌లు, కరెంట్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులు కూడా పెరిగాయని ఈ సర్వే వివరించింది.  పైన పేర్కొన్న ప్రతీ కేటగిరీలో రేట్లు 2020 తో పోలిస్తే 2021 లో ఎగిశాయని ఈ సర్వేలో పాల్గొన్న రెస్పాండెంట్లు వివరించారు. ముఖ్యంగా పెట్రోల్‌‌, డీజిల్ రేట్లు భారంగా మారాయని 75 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. 

ఇన్‌‌కమ్‌‌ లెవెల్స్‌‌ పెరగలేదు..

 ఏయే ప్రొడక్ట్‌‌ల ధరలు  పెరగడంతో  ఇబ్బంది పడుతున్నారో సర్వేలో పాల్గొన్న వారిని అడిగామని యుగావ్‌‌–మింట్–సీపీఆర్  పేర్కొంది. పెట్రోల్‌‌, డీజిల్‌‌  రేట్లు పెరగడంతో  ఫైనాన్షియల్‌‌గా భారం పెరిగిందని మెజార్టీ రెస్పాండెంట్లు చెప్పారు. ముఖ్యంగా తక్కువ ఇన్‌‌కమ్‌‌ లెవెల్స్‌‌ ఉన్న రెస్పాండెంట్లు   యుటిలిటీ బిల్లులు, గ్రోసరీ వంటి ఇంటికి అవసరమయ్యే ప్రొడక్ట్‌‌ల రేట్లు పెరగడాన్ని ఎక్కువ భారంగా భావిస్తున్నారు. అదే ఇన్‌‌కమ్‌‌ లెవెల్స్‌‌ ఎక్కువగా ఉన్న రెస్పాండెంట్లు మెడికల్ ఖర్చులు, లగ్జరీ ప్రొడక్ట్‌‌లు,  బట్టలు, ఫుట్‌‌వేర్‌‌‌‌, ఎలక్ట్రానిక్స్‌‌ వంటి కన్జంప్షన్ గూడ్స్ ధరలు పెరగడం ఎక్కువ భారంగా చూస్తున్నారు. కాగా, ఈ సర్వే కోసం 206 సిటీలలోని 12,900 మంది రెస్పాండెంట్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 45 శాతం మంది రెస్పాండెంట్లు మిలీనియల్స్‌‌ గ్రూప్‌‌ (25–40 ఏళ్ల మధ్య వయసున్న) వారు ఉన్నారు. మరో 30 శాతం మంది 18–24 ఏళ్ల మధ్య ఉన్నవారు కాగా,  మిగిలిన వారు 40 ఏళ్లకు పైనున్నవారు. 

కొనుగోలు సామర్ధ్యం తగ్గింది...

ఇల్లు లేదా కారు వంటి పెద్ద కొనుగోళ్లను చేయడానికి మెజార్టీ రెస్పాండెంట్లు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని, కరోనా వలన వీరి కొనుగోలు సామర్ధ్యం తగ్గిందని ఈ సర్వే వెల్లడించింది. ఏడాదిలోపు ఇల్లు తీసుకుంటామని 2019 లో 22 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పగా, 2021లో ఈ నెంబర్‌‌ 16 శాతానికి తగ్గింది.  అదే  కారు తీసుకోవాలనుకునే వారి వాటా 2019 లో 30 శాతంగా ఉండగా, 2021 లో 22 శాతానికి తగ్గిందని ఈ సర్వే వెల్లడించింది. టూ వీలర్లను తీసుకోవాలనుకునే వారిలో ఎటువంటి తేడాలేదని వివరించింది.  కాగా, వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్ పెరగడంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌‌లు లేదా ల్యాప్‌‌టాప్‌‌లను కొనడం పెరిగిందని వెల్లడించింది.

ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాం..

గత రెండేళ్లలో మెజార్టీ  కుటుంబాల ఇన్‌‌కమ్‌‌ లెవెల్స్‌‌ పెరగలేదు. ధరలు పెరగడం, కరోనా ఒత్తిళ్లు ఇటువంటి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. గత ఏడాది కాలంలో  హై శాలరీ అందుకునే వారిలో జీతాలు బాగానే  పెరిగాయని, జీతాలు తక్కువగా ఉన్నవారి శాలరీలు కూడా పెరిగాయని ఈ సర్వే వెల్లడించింది. కానీ, ఈ రెండింటికి మిడిల్‌‌లో ఉన్నవారి శాలరీలు పెరగలేదని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 7,869 మంది  రెస్పాండెంట్లు వర్క్‌‌ చేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది తమ ఇన్‌‌కమ్ లెవెల్స్ పెరగలేదని చెప్పారు. ఇలాంటి వారిపై  ఇన్‌‌ఫ్లేషన్ ప్రభావం ఎక్కువగా ఉందని యుగావ్‌‌–మింట్‌‌–సీపీఆర్ సర్వే పేర్కొంది. మరోవైపు గత ఏడాది కాలంలో  ఏదో విధంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నామని 81 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. ఎందుకు ఈ సమస్యలు వచ్చాయని పరిశీలిస్తే చివరికి ఇన్‌‌ఫ్లేషన్ పెరగడం ప్రధాన కారణంగా కనిపించిందని ఈ సర్వే పేర్కొంది. ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో సేవింగ్స్‌‌, ఇన్వెస్ట్‌‌మెంట్ల కోసం డబ్బులు కేటాయించుకోవడం కష్టంగా మారిందని మెజార్టీ రెస్పాండెంట్లు అన్నారు.