
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ సమతామూర్తిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 4:40గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి ముచ్చింతల్కు చేరుకుని సాయంత్రం 5 గంటల నుంచి 5.15 గంటల వరకు గెస్ట్హౌస్లో విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం 5.20గంటలకు సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రథ సప్తమిని పురస్కరించుకొని 7వ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ దుష్ట గ్రహ బాధా నివారణకై శ్రీ నారసింహ ఇష్టి, జ్ఞానాజ్ఞానకృత సర్వవిధ పాప నివారణ కోసం శ్రీమన్నారయణ ఇష్టి, లక్ష్మీ నారాయణ మహా క్రతువు, చతుర్వేద పారాయణం నిర్వహిస్తున్నారు. ప్రవచన మండపంలో శ్రీ నారసింహ అష్టోత్తర శతనామావళి పూజ, సామూహిక ఆదిత్య పారాయణం, ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరగనున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.