జులై-సెప్టెంబర్​ క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు

జులై-సెప్టెంబర్​ క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు
  • జులై-సెప్టెంబర్​ క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు  
  • 36 శాతం పెరిగినయ్​
  • 7 సిటీలలో 1,20,280 ఇండ్ల సేల్స్‌‌‌‌ అనరాక్​ రిపోర్టు వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో ఇండ్ల అమ్మకాలు జులై–సెప్టెంబర్​ మధ్య కాలంలో 36 శాతం ఎగిశాయి. సగటు ఇండ్ల రేటు కూడా యాన్యువల్​బేసిస్​పై 11 శాతం పెరగ్గా, హైదరాబాద్​లో మాత్రం ఏకంగా 18 శాతం ఎక్కువైంది. మొత్తం ఇండ్ల అమ్మకాలలో ముంబై, పుణె సిటీల వాటా 51 శాతంగా రికార్డయింది. రెపో రేటును ఆర్​బీఐ మార్చకపోవడం వల్ల హోమ్​లోన్ల వడ్డీ రేట్లు నిలకడగా ఉండటం సేల్స్​ జోరుకు ఊతమిచ్చిందని అనరాక్​ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు 1,20,280  యూనిట్లకు చేరాయి.  అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ 88,230 గా ఉంది. క్వార్టర్లీ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్​ క్వార్టర్​ అమ్మకాలు ఆల్​టైమ్​ హై రికార్డు చేసినట్లు అనరాక్​ రిపోర్టు పేర్కొంది. హౌసింగ్​ డేటాలో అపార్ట్​మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్​ఫ్లోర్లు ఉన్నాయి. 

హైదరాబాద్​లో 41 శాతం అప్​... 

జులై–సెప్టెంబర్​ 2023 లో ఢిల్లీ–ఎన్​సీఆర్​లో హౌసింగ్​ సేల్స్​ 6 శాతం పెరిగి 15,865 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది అమ్ముడైన ఇండ్ల  సంఖ్య 14,970.  ఇదే ముంబైలోనైతే ఇండ్ల అమ్మకాలు ఏకంగా 46 శాతం పెరిగి 38,500 యూనిట్లుగా రికార్డయ్యాయి. జులై–సెప్టెంబర్​ 2022 మధ్య కాలంలో ఎంఎంఆర్​లో అమ్మకాలు 26,400 ఇండ్లు మాత్రమే. మరోవైపు, బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 29 శాతం పెరిగి 16,395 యూనిట్లకు చేరాయి. హైదరాబాద్​లో 41 శాతం గ్రోత్​తో ఇండ్ల అమ్మకాలు 16,375 యూనిట్లుగా రికార్డయ్యాయి. పుణెలో అత్యధిక గ్రోత్​ రికార్డయింది. ఈ సిటీలో ఇండ్ల సేల్స్​ 63 శాతం ఎక్కువై 22,885 యూనిట్లకు చేరాయి. చెన్నైలో హౌసింగ్​ సేల్స్​ 42 శాతం పెరగ్గా, కోల్​కతాలో 7 శాతం పెరిగినట్లు అనరాక్​ రిపోర్టు వెల్లడించింది. 

సొంత ఇల్లు కోరిక.....

ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో పాటు, సొంత ఇల్లు కావాలనే కోరిక బలంగా ఉండటంతో ఇండ్లకు గిరాకీ గత రెండేళ్లలో నిలకడగా ఎక్కువవుతోందని రియాల్టీ కంపెనీ  క్రిసుమి కార్పొరేషన్​ మేనేజింగ్ ​డైరెక్టర్​ మోహిత్​ జైన్​ చెప్పారు. భవిష్యత్​లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. లగ్జరీ ఇండ్ల గిరాకీ కూడా నిలకడగా పెరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ గిరాకీ దృష్టిలో పెట్టుకుంటే సప్లయ్​ కూడా కొంత పటిష్టంగానే ఉంటుందని అన్నారు.