
చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్ ప్రజలు ఆందోళనలు ఉధృతం చేశారు. మూడు వారాలుగా శాంతియుతంగా జరుగుతున్న పోరాటం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఇంతకాలం నిరసనలకు పరిమితమైన ఆందోళనకారులు తాజాగా పార్లమెంటుపై దాడులకు దిగారు. బిల్డింగ్‌లో విధ్వంసం సృష్టించారు. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి అదుపు తప్పింది.
1997 జూలై 1న బ్రిటీష్ పాలను నుంచి విముక్తి పొందిన హాంకాంగ్ చైనా పాలనలోకి వెళ్లింది. ఇందుకు గుర్తుగా ప్రభుత్వం జూలై 1న చైనా హ్యాండోవర్ డే నిర్వహిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వేలాది మంది హాంకాంగ్ వాసులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. పార్లమెంటు బిల్డింగ్‌ను చుట్టుముట్టారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడి రాజీనామాకు పట్టుబట్టారు. అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను, అద్దాలను, ఫొటోలను ధ్వంసం చేశారు. బిల్డింగ్ గోడలపై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.