3 మందులు కలిపితే కరోనా వైరస్ ఖతం

3 మందులు కలిపితే కరోనా వైరస్ ఖతం

బీజింగ్: కరోనా మహమ్మారి పని పట్టేందుకు హాంకాంగ్ సైంటిస్టులు మరో కొత్త మార్గం కనుగొన్నారు. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు లోపినవిర్ – రిటానవిర్ అనే యాంటీ వైరల్ మందుతో కొందరు డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అయితే, ఈ మందుకు మరో రెండు యాంటీ వైరల్ డ్రగ్స్ ను కాంబినేషన్ గా మార్చి వాడితే.. మంచి ఫలితాలు వస్తాయని హాంకాంగ్ యూనివర్సిటీ సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది. పరిశోధనలో భాగంగా.. హాంకాంగ్ లోని ఆరు హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న 127 మంది పేషెంట్లకు ఈ కొత్త పద్ధతిని ఉపయోగించారు. లోపినవిర్– రిటానవిర్ తో పాటు ఇంటర్ ఫెరాన్ బీటా 1బీ, రిబావిరిన్ అనే మరో రెండు మందులను కలిపి యాంటీ వైరల్ డ్రగ్ కోంబోను ప్రయోగించారు. దీంతో ఈ మూడు మందులు కలిపి తీసుకున్న పేషెంట్లలో ఏడు రోజుల్లోనే సింప్టమ్స్ తగ్గిపోయినట్లు గుర్తించారు. వీరి దేహాల్లో కరోనా వైరస్ కణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. ఈ ట్రీట్ మెంట్ తో పేషెంట్లు హాస్పిటల్ లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం కూడా తప్పుతుందని సైంటిస్టులు తెలిపారు. అయితే, ఈ పద్ధతిని మితంగా, స్వల్పంగా అనారోగ్యంతో ఉన్న పేషెంట్లకు మాత్రమే ఉపయోగించామని, సీరియస్ పేషెంట్లలో కూడా ఈ మందులు బాగా పనిచేస్తాయా? లేదా? అన్నది తెలుసుకునేందుకు భారీ ఎత్తున ఫేజ్ 3 ట్రయల్స్ చేయాల్సి ఉందన్నారు.