నేరస్థుల అప్పగింతపై వెనక్కి తగ్గిన హాంకాంగ్

నేరస్థుల అప్పగింతపై వెనక్కి తగ్గిన హాంకాంగ్

హాంకాంగ్: వివాదాస్పద ‘నేరస్థుల అప్పగింత బిల్లు’ను వెనక్కి తీసుకుంటున్నట్లు హాంకాంగ్ చీఫ్​ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్​ప్రకటించారు. ‘‘రోజురోజుకు పెరిగిపోతున్న హింస వల్ల మన సొసైటీ పునాదులు డ్యామేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘రూల్ ఆఫ్ లా’ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, ఆ బిల్లును ప్రభుత్వం అధికారికంగా విత్​డ్రా చేసుకుంటుంది” అని చెప్పారు. బుధవారం టీవీ లైవ్​టెలికాస్ట్​లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన లామ్.. తన నిర్ణయాన్ని వెల్లడించారు.

‘‘ఇండిపెండెంట్ పోలీస్ కంప్లయింట్స్ కౌన్సిల్ (ఐపీసీసీ) రిపోర్టు రికమండేషన్స్​ను ప్రభుత్వం ఫాలో అవుతుంది. ఈ నెల నుంచి నేను, నా ప్రధాన అధికారులు.. ప్రజలతో డైరెక్టుగా మాట్లాడుతారు. ప్రజల్లో చెలరేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు మేం దారులు వెతకాలి. పరిష్కారాలు కనుగొనాలి” అని వివరించారు. ప్రొటెస్టర్ల విషయంలో పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని, ఇప్పటివరకు 1,183 మందిని అక్రమంగా అరెస్టు చేశారని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. హాంకాంగ్​లో  ఏప్రిల్​లో మొదలైన ఆందోళనలు జూన్​లో ఊపందుకున్నాయి. రోజులు గడిచే కొద్దీ హింసాత్మకంగా మారాయి. ప్రొటెస్టర్ల డిమాండ్లలో నేరస్థుల బిల్లును వెనక్కి తీసుకోవాలన్నది ప్రధానమైనది. ఈ బిల్లు ప్రకారం నేరస్థులనే అనుమానమున్న వారిని చైనాకు అప్పగించే అవకాశం ఉంటుంది.