
- కాంగ్రెస్ పార్టీ ప్రయార్టీ ఇవ్వాలంటున్న రైతులు
- పనులు పూర్తయితే 1.90 లక్షల ఎకరాలకు సాగునీరు
- ఏండ్లు గడుస్తున్నా కంప్లీట్ కానీ భూ సేకరణ
కామారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులపై ఇక్కడి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రయార్టీలో చేర్చి ఫండ్స్రిలీజ్చేస్తే, పన్నుల్లో స్పీడ్ పెరిగే వీలుంది. ఫండ్స్ కొరత కారణంగా ఏండ్ల నుంచి భూసేకరణ కంప్లీట్ కాలేదు. మెయిన్ కెనాల్స్‌తో పాటు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. సాగునీటి వనరులు లేని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని బీడు భూములను సస్యశామలం చేసే ఉద్ధేశంతో ప్యాకేజీ 22 పనులను ప్రతిపాదించారు.
2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం రాష్ట్రంలోని ఆయా ఏరియాలకు సాగు నీళ్లందించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,04,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్యాకేజీ 20,21,22 పనులు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 22వ ప్యాకేజీ పనులతో లక్షా 90 వేల ఎకరాలకు నీరందించాలనుకున్నారు. ఈ ప్యాకేజీ పనుల కోసం అప్పట్లో రూ.1,446 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. రూ. 400 కోట్ల మేర పనులు జరిగాయి.
20, 21 ప్యాకేజీలు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినవి. అయితే ఇదే జిల్లాలోని మంచిప్ప కొండెం చెరువు నుంచి లిఫ్ట్ ద్వారా కామారెడ్డి జిల్లాలోని సదాశివ్‌నగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్వరకు నీరు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి లెఫ్ట్, రైట్మెయిన్కెనాల్స్ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని ఆయా ఏరియాలతో పాటు మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలాలకు సాగు నీళ్లు అందనున్నాయి.
40 శాతం పనులే..
17 ఏండ్లలో 40 శాతం మేర ఈ ప్యాకేజీ పనులు పూర్తయ్యాయి. కొండెం చెరువు నుంచి ఇక్కడికి నీళ్లు రావడానికి రిజర్వాయర్ నిర్మాణం కంప్లీట్కావాలి. రెట్, లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ కొంత వరకు తవ్వకాలు జరిగాయి. లెఫ్ట్ కెనాల్51 కిలోమీటర్లకు గాను 20 కిలోమీటర్లు, రైట్కెనాల్8 కిలోమీటర్లు తవ్వారు. భూంపల్లి వద్ద రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఫైనల్ వర్క్స్కావాలి.
మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మోతె, కాటేవాడి, తిమ్మక్పల్లిల్లో రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించింది. సదాశివ్నగర్మండలం యాచారం వద్ద 5.6 కిలోమీటర్ల సొరంగమార్గం తవ్వాల్సి ఉండగా, 30 శాతం మేర మాత్రమే పనులు కంప్లీట్అయ్యాయి. ఇంకా మెయిన్కెనాల్స్తో పాటు, లింక్కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, రిజర్వాయర్ల నిర్మాణం, సొరంగ మార్గం పనులు కంప్లీట్కావాల్సి ఉంది.
భూ సేకరణ కంప్లీట్ కాలే
మెయిన్ కెనాల్స్, సబ్ కెనాల్స్‌తో పాటు, రిజర్వాయర్లు, సొరంగ మార్గం కోసం 4,450 ఎకరాల భూమి అవసరం. ఇప్పటి వరకు 1,255 ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. ఆశించిన స్థాయిలో ఫండ్స్రిలీజ్ కాక అవసరమైన దాంట్లో సగం భూమిని కూడా సేకరించలేదు. సర్వే కంప్లీట్ చేసిన భూమికి కూడా రైతులకు పరిహారం చెల్లించలేదు. సేకరించిన దాంట్లో ఇంకా రూ.20 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన ప్రాజెక్ట్అయినందున తిరిగి ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన దృష్ట్యా ఈ పనులపై ఫోకస్ చేస్తారని రైతులు ఆశిస్తున్నారు.ప్రభుత్వం కూడా ఆయా శాఖలకు సంబంధించి వర్క్స్, వీటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్, ఫండ్స్ రిలీజ్ లాంటి వివరాలు సేకరిస్తోంది. ఈ పరిస్థితుల్లో 22వ ప్యాకేజీ పనులు త్వరగా కంప్లీట్ చేసి సాగు నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.