నామినేటెడ్ పదవులపై ఆశలు..కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులకు భారీగా పోటీ

నామినేటెడ్  పదవులపై ఆశలు..కార్పొరేషన్ల చైర్మన్  పోస్టులకు భారీగా పోటీ
  • ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావహులు
  • సోషల్​ ఈక్వేషన్లు లెక్కలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు

హైదరాబాద్, వెలుగు: నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సామాజిక, గెలుపు సమీకరణాల దృష్ట్యా చాలా మంది నేతలకు ఎమ్మెల్యే టికెట్లను కేటాయించలేదు. 

ఎమ్మెల్సీ, ఎంపీ, నామినేటెడ్ పదవులపై హైకమాండ్, పార్టీ పెద్దల హామీతో పోటీ నుంచి తప్పుకున్నోళ్లు ఇప్పుడు ఆ పదవులపై ఆశతో ఉన్నారు. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి.. 54 కార్పొరేషన్ల పాలకవర్గాలను ఒకే ఒక్క జీవోతో రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.

కీలక కార్పొరేషన్లపై చూపు

కార్పొరేషన్ల పదవుల కోసం సీనియర్లతో పాటు యంగ్ లీడర్లూ పోటీ పడుతున్నారు. కీలకమైన కార్పొరేషన్ల పదవులను తెచ్చుకునేందుకు ఇప్పటికే పలువురు లీడర్లు లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి ఎన్నికల టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వెయ్యి మందికిపైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. 
అందులో చాలా మంది సీనియర్లకు టికెట్ దక్కలేదు. అందులో కొందరికి ఎంపీ లేదా ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వారే కాకుండా చాలా మంది నేతలు పార్టీ కోసం ముందునుంచి కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వాళ్లంతా ఇప్పుడు కార్పొరేషన్ల పదవుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే, ఉన్న 54 కార్పొరేషన్ల పదవుల కోసం నేతల మధ్య మాత్రం తీవ్రమైన పోటీ నెలకొన్నది. పలువురు డీసీసీ అధ్యక్షులు కూడా చైర్మన్ పదవుల రేసులో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన నేతలు కూడా ఆయా పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

పార్టీ ప్రాధాన్యాలేమిటో..

సామాజిక న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ చెప్తున్నది. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో బీసీలకు కొంత అన్యాయం జరిగిందని పార్టీలోని నేతలే విమర్శలు చేసిన పరిస్థితులున్నాయి. కార్పొరేషన్ల చైర్మన్ల పదవులతో ఆ లోటును భర్తీ చేయాలనే చర్చ జరుగుతున్నది. సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుని బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ కూడా వస్తున్నది. అయితే సీనియర్లు, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ ఆయా పదవులను కేటాయించాల్సి ఉంది. మరి ఏ జిల్లా నుంచి ఏ వర్గం నేతలకు పదవులు వస్తాయో చూడాలి.

దిగిపోయేముందు పదవులు ఇచ్చిన బీఆర్ఎస్

కాంగ్రెస్​లో కార్పొరేషన్ల పదవుల కోసం ఇప్పుడు పోటీ ఉంటే.. అటు బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పదవులు దక్కించుకున్న నేతలకు నిరాశ తప్పలేదు. చాలా మంది నేతలకు ఆ పదవులు మూణ్నాళ్ల ముచ్చటయ్యాయి. ఎన్నికలకు కొద్ది రోజుల మందు రైతుబంధు సమితి, మిషన్ భగీరథ, ఎంబీసీ, ఎస్సీ కార్పొరేషన్ వంటి వాటికి ఎన్నికల కోడ్ రేపు వస్తుందనగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. వారు ఆ పదవుల్లో నెలన్నర మాత్రమే కొనసాగారు.

ఎన్నికల్లో గెలుపు సమీకరణాలు, నేతలను కాపాడుకునే దృష్ట్యా నాటి సర్కార్ పదవులిచ్చినా.. జస్ట్ నెలన్నర రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆ పదవులన్నీ రద్దయిపోయాయి.