
- మక్తల్ అభివృద్ధే ధ్యేయం: మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు: మక్తల్ నా పుట్టిన స్థలం అని, నా చావు కూడా ఇక్కడే అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భావోద్వేగంగా అన్నారు. గురువారం పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ సమక్షంలో మైనారిటీ మహిళలకు 200 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మక్తల్ ప్రజల మధ్యే పెరిగానని, ఈ నియోజకవర్గ అభివృద్ధికి రెండింతల నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఏటా 500 మంది మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్టు చెప్పారు.
పెద్దజట్రం గ్రామంలో శిక్షణ పొందిన మరో 35 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు. మక్తల్, మాగనూరు, కృష్ణ, ఊట్కూర్, నర్వకు మండలాలకు చెందిన 140 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. త్వరలో మైనారిటీలకు మార్కెట్ చైర్మన్ పదవి కేటాయించనున్నట్లు వెల్లడించారు. పండుగ సాయన్నను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన జయంతి నాటికి ట్యాంక్ బండ్ వద్ద విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటాలని, ఖేలో ఇండియా పోటీల్లో గెలిచిన 72 బాలికలకు సర్టిఫికెట్‌లు పంపిణీ చేశారు. మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పండుగ సాయన్న జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్న మంత్రి, ఆయన ఆశయ సాధనలో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్, జిల్లా మైనారిటీ ఆఫీసర్ రషీద్, నాయకులు బాలకృష్ణారెడ్డి, కోళ్ల వెంకటేశ్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేశ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ రవికుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .