
హైదరాబాద్, వెలుగు: భాషాపరమైన అంతరాలను తొలగిస్తామని కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ సంజయ్ జాజు తెలిపారు. ఇంక్యుబేటర్లు, అంకుర సంస్థలతో టీ హబ్లో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించేందుకు సమాచార, ప్రసార శాఖ ‘వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్’ వేదికను ఏర్పాటు చేసిందన్నారు. డిజిటల్ వ్యవస్థ నిర్మాణంలో కీలకమైన ‘కళాసేతు’, ‘భాషాసేతు’ పోటీలను ఈ వేదిక ద్వారా ప్రారంభించామన్నారు. ఈ పోటీల్లో పాల్గొని దేశంలోని భాషాపరమైన, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ఏఐ అంకుర సంస్థలను ఆహ్వానించారు. https://wavex.wavesbazaar.com లోని వేవెక్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.