- భయంతో గొంతు కోసుకున్న భర్త
- సిద్దిపేట పట్టణంలో దారుణం
సిద్దిపేట రూరల్, వెలుగు : అనుమానంతో ఓ వ్యక్తి భార్య, బిడ్డపై కత్తితో దాడి చేసిన అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. భార్య చనిపోగా, మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... దుల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానిక చెందిన దున్నపోతుల ఎల్లయ్య భార్య శ్రీలత (32), కూతురు హర్షిత, కొడుకు అజయ్‌తో కలిసి పదేండ్లు సిద్దిపేటలో ఉన్నాడు. కొన్ని నెలల కింద కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లిన ఎల్లయ్య పది రోజుల కింద తిరిగి సిద్దిపేటకు వచ్చి ఆదర్శనగర్‌లో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటున్నాడు.
భార్యపై అనుమానం పెంచుకున్న ఎల్లయ్య ఆదివారం రాత్రి మద్యం మత్తులో కత్తితో భార్య శ్రీలత గొంతు కోసిన అనంతరం కూతురు హర్షిత గొంతు సైతం కోసేందుకు ప్రయత్నించడంతో ఆమె అడ్డుకుంది. దీంతో రోకలిబండతో దాడి చేశాడు. హర్షిత కేకలు విన్న అజయ్ వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. కాలనీవాసులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో భయాందోళనకు గురైన ఎల్లయ్య గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
స్థానికులు, పోలీసులు కలిసి ముగ్గురిని హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలోనే శ్రీలత చనిపోగా.. హర్షిత, ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. దాడికి ముందు శ్రీలత, హర్షితకు పురుగుల మందు తాగించిన ఆనవాళ్లు సైతం ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని టూ టౌన్ సీఐ ఉపేందర్ పరిశీలించారు.
