కరోనా పేషంట్ బతికుండగానే చనిపోయాడంటూ..

కరోనా పేషంట్ బతికుండగానే చనిపోయాడంటూ..

సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ నిర్వాకం
భర్త మరణించినట్లు వినగానే భార్యకు హార్ట్ స్ట్రోక్
డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు వచ్చాక ఫ్యామిలీకి తెలిసిన అసలు నిజం

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ హాస్పిటళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా పేషెంట్లకు ఇచ్చే ట్రీట్ మెంట్ కు లక్షల్లో బిల్లులు వేస్తూ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. వీటిపై ఎన్ని విమర్శలు వచ్చిన అటు హాస్పిటల్ మేనేజ్ మెంట్లుగానీ, ప్రభుత్వం గానీ అస్సలు పట్టించుకోవటం లేదు. తాజాగా సికింద్రాబాద్ లో ఓ కార్పొరేట్ హాస్పిటల్ మరో నిర్వాకానికి పాల్పడింది. బతికున్న పేషెంట్ ను చనిపోయాడంటూ వారి ఫ్యామిలీ మెంబర్స్ కు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఈ వార్త వినగానే పేషెంట్ భార్య షాక్ కు గురికావటంతో ఆమెకు హార్ట్ఎటాక్ వచ్చింది. ఆమెను వెంటనే మరో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. హాస్పిటల్ వాళ్లు ఇచ్చిన సమాచారంతో డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులను దాదాపు 7 గంటల పాటు వెయిట్ చేయించి అప్పుడు పేషెంట్ బతికే ఉన్నాడంటూ చెప్పడంతో అంతా షాక్ కు గురయ్యారు.

తప్పించుకునే ప్రయత్నం
ఐతే పేషెంట్ చనిపోయాడని చెప్పిన వారిని చూపించాలని నిలదీయటంతో హాస్పిటల్ వర్గాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయని కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్నారు. అలా సమాచారం ఇచ్చిందెవరో తెలియదంటున్నారని మీడియాతో చెప్పారు. అంబర్‌‌పేటకు
చెందిన సి. నరసింగరావు (67) శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతుండటంతో గత నెల 27న హాస్పిటల్ లో చేర్చారు. కరోనా పాజిటివ్ అని తేలటంతో 4 రోజుల పాటు ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ ఇచ్చారని వీడియో కాల్ ద్వారా పేషెంట్ ను కుటుంబ సభ్యులతో మాట్లాడిచ్చారన్నారు. ఆ తర్వాత రోజు నుంచి ఆరోగ్యం క్షీణించిందంటూ వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ ఇస్తున్నామంటూ 10 రోజులకు రూ. 8 లక్షల బిల్లు వేశారని పేషెంట్ తమ్ముడు అంబర్ పేట్ శంకర్ తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటలకు నర్సింగరావు చనిపోయారంటూ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందని దీంతో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి ఉదయమే డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు హాస్పిటల్ వెళ్లామని ఆయన చెప్పారు. మంగళవారం వరకు బాగానే ఉన్న వ్యక్తి ఎలా చనిపోయాడంటూ బుధవారం హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించగా దాదాపు 7 గంటలు పాటు వెయిట్ చేయించారని అన్నారు. హాస్పిటల్ లో తెలిసిన వారి ద్వారా ఆరా తీయగా పేషెంట్ బతికే ఉన్నాడని తెలిసిందని. దీంతో నర్సింగ రావు బతికి ఉన్నాడా ? చనిపోయాడా చెప్పాలంటూ గట్టిగా నిలదీయటంతో వెంటనే వీడియో కాల్ చేసి పేషెంట్ బతికే ఉన్నాడంటూ హాస్పిటల్ సిబ్బంది చెప్పారని అంబర్ పేట్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన హాస్పిటల్ మేనేజ్ మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

చనిపోయాడని చెప్పలేదు
నర్సింగరావు చనిపోయాడని కుటుంబ సభ్యులకు చెప్పలేదని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. ఎవరో ఇచ్చిన సమాచారాన్ని హాస్పిటల్ వాళ్లు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారని తెలిపాయి. కుటుంబ సభ్యులు కోరగానే తాము వీడియో కాల్ ద్వారా పేషెంట్ చూపించామని చెప్పాయి.

పది రోజులకు రూ. 10 లక్షలు బిల్లు చేసి 6 లక్షలు కట్టించుకున్నారు. బుధవారం రాత్రి వీడియో కాల్ చేసి మీ మావయ్య చనిపోయాడు మరో రూ. 3.75 లక్షలు కట్టి డెడ్ బాడీ తీసుకెళ్లండి అని చెప్పారు. దీంతో మా అత్తయకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులమంతా మానసికంగా ఆందోళకు గురయ్యాం. హాస్పిటల్ కు వచ్చాక 7 గంటల తర్వాత మావయ్య బతికే ఉన్నట్లు చెప్పారు.
– పేషెంట్ కోడలు

For More News..

లాక్డౌన్ ఉండదంటూ మంత్రుల లీకులు

ప్రభుత్వంలో 10 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

సెక్రటేరియట్ శిథిలాల ట్రాన్స్ పోర్టుకే రూ. 15 కోట్లు!