దవాఖాన్లు సాల్తలేవు.. సర్కారు కదుల్తలేదు

దవాఖాన్లు సాల్తలేవు..  సర్కారు కదుల్తలేదు

    రోగులతో ఫుల్లవుతున్న    సర్కారీ హాస్పిటళ్లు

    ఓపీ డాక్టర్లకు వశంగాని పని
   
    ఇంకో 226 ఆస్పత్రులు అవసరమన్న హెల్త్‌‌‌‌ సర్వే

    కట్టలేమన్న సర్కారు.. ఉన్నవే బాగజేస్తమని వెల్లడి

రాష్ట్రంలో సర్కారీ దవాఖానాలు సరిపోక జనం తిప్పలు వడుతున్నరు. హాస్పిటళ్ల కొరత విపరీతంగా ఉన్నా, ఉన్న వాటిల్లో వసతులు కూడా సక్కగ లేకున్నా రోగుల తాకిడి మాత్రం తగ్గుతలేదు. హాస్పిటళ్లపై ఇంతలా ఒత్తిడి ఉన్నా సర్కారు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా కొత్తవి కట్టబోమని, పాతవాటినే రిపేర్‌‌‌‌ జేయిస్తామని ఈమధ్యే స్పష్టం చేసింది.

అక్కడోటి.. ఇక్కడోటి..

రాష్ర్టంలో గల్లీ గల్లీకీ ప్రైవేటు హాస్పిటళ్లు పుట్టుకొస్తుంటే సర్కారీ హాస్పిటళ్లు మాత్రం ఎక్కడో విసిరేసినట్టుగా అక్కడోటి ఇక్కడోటి ఉన్నాయి. పీహెచ్‌‌‌‌సీలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో రోగుల ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. అక్కడ సరిగా సేవలందకపోవడంతో జిల్లా దవాఖాన్లు, టీచింగ్ హాస్పిటళ్లకూ రోగులు పోటెత్తుతున్నారు. డాక్టర్లపైనా భారం పెరిగి ఓపీలో ఒక్కో రోగికి ఒక్క నిమిషం కూడా కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇన్‌‌‌‌పేషెంట్లకు బెడ్లు సరిపోక నేలపైనే పడుకోబెట్టి ట్రీట్ చేసిన ఘటనలూ ఉన్నాయి. అయినా ఉన్న దవాఖాన్లను బాగు చేయడమే తప్ప కొత్త వాటిని పెంచే ఆలోచన లేదని ఇటీవలి సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తామంటూనే పీహెచ్‌‌‌‌సీల సంఖ్య పెంచకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

కనీసం 226 దవాఖాన్లు గావాలె

రాష్ర్టంలో ప్రస్తుతం 643 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 91 కమ్యునిటీ హెల్త్‌‌‌‌ సెంటర్లున్నాయి. ఒక్కో పీహెచ్‌‌‌‌సీ పరిధిలో సగటున 30 నుంచి 33 వేల మంది ప్రజలుంటే ఒక్కో సీహెచ్‌‌‌‌సీ పరిధిలో 1.05 లక్షల నుంచి 2.37 లక్షల మంది ఉన్నారు. రూరల్ హెల్త్ సర్వీస్‌‌‌‌–2018 నివేదిక ప్రకారం రాష్ర్ట జనాభా అవసరాలకు ఇప్పుడున్న పీహెచ్‌‌‌‌సీలు, సీహెచ్‌‌‌‌సీలు సరిపోవు. కనీసం 125 పీహెచ్‌‌‌‌సీలు, 101 సీహెచ్‌‌‌‌సీలు అవసరముందని నివేదిక పేర్కొంది. ఇటీవల పార్లమెంట్‌‌‌‌లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హెల్త్ మినిస్టర్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలోనూ ఇదే అంశాన్ని పేర్కొన్నారు. ఊళ్లలో ఉండే ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ, పీఎంపీలు కూడా తమ క్లినిక్‌‌‌‌లను 24 గంటలు నడిపిస్తున్నారు. కానీ సర్కారు దవాఖాన్లలో మాత్రం 24 గంటల సేవలు ఉండటం లేదు. ప్రస్తుతం ఉన్న 643 పీహెచ్‌‌‌‌సీలలో 290 మాత్రమే 24 గంటలు నడుస్తున్నాయి. మిగిలినవాటిని సాయంత్రానికే మూసేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటే దాకా డాక్టర్లు పీహెచ్‌‌‌‌సీల్లో కనిపిస్తలేరు. ఒక్కో ఊరుకు ఐదారు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో పీహెచ్‌‌‌‌సీలుంటున్నాయి. చిన్న చిన్న నొప్పులకు, జ్వరాలకు అంత దూరం వెళ్లలేక.. వెళ్లినా దవాఖాన్లు డాక్టర్లు అందుబాటులో ఉంటారన్న నమ్మకం లేక ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు.

మెడికల్ కాలేజీలె.. దవాఖాన్లు కాదు

రాష్ట్రం ఏర్పడ్డాక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది నిజమే అయినా టీచింగ్ హాస్పిటళ్లు మాత్రం కొత్తవి నెలకొల్పలేదు. ఆయా కాలేజీలు ఏర్పాటు చేసిన చోట ఉన్న జిల్లా హాస్పిటళ్లనే టీచింగ్ హాస్పిటళ్లుగా బదలాయించారు. నల్లగొండ జిల్లా హాస్పిటల్‌‌‌‌ను, అక్కడి కాలేజీ అనుబంధ దవాఖానాగా, సూర్యాపేట హాస్పిటల్‌‌‌‌ను సూర్యాపేట మెడికల్ కాలేజీకి అనుబంధంగా, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా హాస్పిటల్‌‌‌‌ను మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మెడికల్ కాలేజీకి అనుబంధంగా తీసుకున్నారు. జిల్లా హాస్పిటల్‌‌‌‌ను వదిలి అనుబంధంగా మరో హాస్పిటల్ కడితే రోగులకు మేలు జరిగి ఉండేదని డాక్టర్లు చెబుతున్నారు. నగరానికి 4 వైపుల సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లు నిర్మిస్తామన్నా ఆ ఊసే లేదు.

రిఫరల్ సిస్టం ఎట్ల?
కొన్ని ఫారిన్ దేశాల్లో పైస్థాయి హాస్పిటల్కు వెళ్లాలంటే కిందిస్థాయి దవాఖాన్లు రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ తరహా వ్యవస్థనే అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించింది. అయితే కిందిస్థాయిలో సరిపడా పీహెచ్సీలు, సీహెచ్సీలు లేకుండా రిఫరల్ సిస్టం ఎట్ల సాధ్యమని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తామని హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ మహేశ్ వెల్లడించారు. రోగాలు రాకుండా ప్రివెంటివ్ చర్యలు తీసుకోవాలన్నా, హెల్త్ ఎడ్యుకేషన్ అందించాలన్నా కింది స్థాయి ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాల్సిందేనన్నారు.