న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 0.52శాతానికి చేరింది. ఇది గత నాలుగు నెలల్లో అత్యధికం. ఈ ఏడాది జూన్‌లో మైనస్ 0.19 శాతంగా, జులైలో మైనస్ 0.58 శాతంగా నమోదైన ఇన్‌ఫ్లేషన్, ఆగస్టులో మాత్రం పెరిగింది. కిందటేడాది ఆగస్టులో డబ్ల్యూపీఐ 1.25 శాతంగా ఉంది.
ఆహార ఉత్పత్తులు, తయారీ వస్తువుల ధరలు పెరగడం వల్ల హోల్‌సేల్ ద్రవ్యోల్బణం పెరిగిందని పరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కూరగాయలు, పప్పుల రేట్లు పెరిగాయి. అయితే బంగాళదుంప, ఉల్లి ధరలు మాత్రం భారీగా పడ్డాయి. తయారీ రంగంలో డబ్ల్యూపీఐ 2.55శాతానికి చేరుకుంది.
ఇంధన, విద్యుత్ విభాగంలో మాత్రం మైనస్ 3.17శాతంగా నమోదైంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం, సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 0.9శాతానికి చేరే అవకాశం ఉంది. జీఎస్‌టీ 2.0 వంటి సంస్కరణలతో ఇది తగ్గనుంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తెలిపే సీపీఐ ఆగస్టులో 2.07 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే.
