కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బస్సు .. అందజేసిన కేంద్ర మంత్రి

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బస్సు .. అందజేసిన కేంద్ర మంత్రి
  •  కేంద్ర మంత్రి సంజయ్ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ రవాణా కష్టాలు తొలిగిపోయాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీకి బస్సును అందజేశారు. ఎంపీ లాడ్స్ నిధులతోపాటు దాతల నుంచి సేకరించిన నిధులతో బస్సును కొనుగోలు చేసి ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ ఆఫీసు వద్ద సోమవారం మెడికల్ కాలేజీ విద్యార్థులు, ప్రొఫెసర్ల సమక్షంలో కొత్త బస్సుకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆ బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు.  

కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  మెడికల్ కాలేజీ విద్యార్థులుండే హాస్టళ్లు మాత్రం దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. బాలికలకు తీగలగుట్టపల్లిలో, బాలురకు సీతారాంపూర్, దుర్గమ్మగడ్డలో హాస్టళ్లు ఉండటంతో అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒకే బస్సు ఉండడంతో అందరిని దింపడానికి నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తోంది. 

ఇదే విషయమై గతంలో ‘వీ6 వెలుగు’లోనూ స్టోరీ పబ్లిష్ అయింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ విద్యార్థులు ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన బస్సును అందజేశారు.  

సమస్యల పరిష్కారానికి కృషి.. 

ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలోని ఇబ్బందులను విద్యార్థుల నుంచి కేంద్ర మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని పేర్కొనగా కాలేజీ, హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆ బాధ్యత తాను తీసుకుంటానని, త్వరలోనే ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కరెంట్ సమస్య లేకుండా త్వరలోనే జనరేటర్ కొనుగోలు చేసి అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్వహణను నెలరోజుల్లో మరో భవనంలోకి మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమయ్యే ఖర్చును తాను భరిస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.