స్టూడెంట్లు, పేరెంట్స్‌‌లో తగ్గని కరోనా భయం

స్టూడెంట్లు, పేరెంట్స్‌‌లో తగ్గని కరోనా భయం
  • యూఆర్‌‌‌‌ఎస్‌‌ల్లో 34 శాతం హాజరు  
  • కేజీబీవీలకూ సగం మందే వస్తున్నరు
  • హాస్టళ్లకు రప్పించేందుకు అధికారుల చర్యలు కరువు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేరెంట్స్, స్టూడెంట్లలో కరోనా భయం ఇంకా తగ్గలేదు. హాస్టల్స్‌‌ను రీ ఓపెన్ చేసి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ 50 శాతం మంది స్టూడెంట్లు కూడా రాకపోవడమే దీనికి నిదర్శనం. స్టూడెంట్లను హాస్టళ్లకు రప్పించేందుకు కొంతమంది టీచర్లు ప్రయత్నాలు చేస్తున్నా.. విద్యాశాఖ నుంచి మాత్రం ఏ విధమైన సపోర్ట్‌‌ అందడం లేదని తెలుస్తోంది. మరోపక్క హాస్టళ్లను రీ ఓపెన్ చేయడానికి సర్కారు పైసా కూడా ఇవ్వలేదని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ హాస్టళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌‌ (యూఆర్‌‌‌‌ఎస్‌‌)లు మొత్తం 672 ఉన్నాయి. వీటిలో చేరడానికి శుక్రవారం వరకు 1,27,731 మంది ఎన్‌‌రోల్‌‌ అయ్యారు. హైకోర్టు పర్మిషన్‌‌తో పోయిన నెల 22న రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లను రీ ఓపెన్‌‌ చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులిచ్చింది. అయితే ఇప్పటివరకు కేవలం 45 శాతం మంది స్టూడెంట్లు మాత్రమే హాస్టల్స్‌‌లో చేరారు. 

25 శాతం స్టూడెంట్లే..
రాష్ట్రంలోని 168 మోడల్ స్కూల్ హాస్టళ్లలో 15,262 మంది స్టూడెంట్లు ఉన్నారు. కేవలం 3,902 మంది మాత్రమే ఇప్పటివరకు హాస్టళ్లలో చేరారు. కొన్ని స్కూళ్లలో స్టూడెంట్లు వస్తామని చెబుతున్నా.. భోజనాలకు సరిపడా సరుకులు లేవనే కారణంగా నిర్వాహకులే వారిని రావద్దని చెబుతున్నట్టు తెలుస్తోంది. 

కేజీబీవీల్లోనూ తక్కువే..
రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో 1,10,666 మందికి గాను 53,538 (48.38%) మంది స్టూడెంట్లు మాత్రమే హాజరవుతున్నారు. 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌‌లో 1,785 మందికి 622 (34.85%) మంది మాత్రమే అటెండ్ అవుతున్నారు. మిగిలిన స్టూడెంట్లు హాస్టళ్లకు వచ్చేందుకు మాత్రం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం హాస్టళ్ల నిర్వహణకు సర్కారు నిధులు ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. ఇప్పటికైనా హాస్టళ్ల నిర్వహణ, రిపేర్లకు నిధులిచ్చి, పూర్తిస్థాయిలో తెరిపించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు. 

అటెండెన్స్ వివరాలు (5.11.21 నాటికి)
సంస్థ     సంఖ్య     స్టూడెంట్లు      వస్తున్నది 
కేజీబీవీ     475     1,10,666     53,538  
గర్ల్స్ హాస్టళ్లు    168     15,262    3,902 
యూఆర్ఎస్​     29      1,785    622 
మొత్తం     672      1,27,731    58,062