హాస్టళ్లు లేక స్టూడెంట్ల గోస 

హాస్టళ్లు లేక స్టూడెంట్ల గోస 

హనుమకొండ, వెలుగు:  కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్లు జాబ్​ల కోసం ప్రిపేర్​అవుతున్న సమయంలోనే ఆఫీసర్లు హాస్టళ్లను మూసేశారు. యూజీసీ న్యాక్​ గుర్తింపు కోసం బిల్డింగ్స్​ రినోవేషన్​పేరున వాటిని క్లోజ్​చేసి స్టూడెంట్లను బలవంతంగా ఖాళీ చేయించారు. స్టూడెంట్ల ధర్నాతో జూన్ మొదటి వారంలోనే రీఓపెన్​ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇంతవరకు పనులు టెండర్ దశ దాటలేదు. దాదాపు రూ.62 లక్షల విలువైన పనులకు టెండర్లు పిలిచి ఈ నెల 29 వ తేదీ వరకు సమయం ఇస్తూ గురువారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల స్టూడెంట్ల ఆందోళనతో జులై 4న హాస్టల్స్​ ఓపెన్​ చేస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు. కానీ ఐదు రోజుల్లో పనులు ఎలా కంప్లీట్ అవుతాయని యూనియన్ల లీడర్లు ప్రశ్నిస్తున్నారు. చెప్పిన సమయానికి రీఓపెన్ చేయకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామంటున్నారు. మరోవైపు సమస్యలు పరిష్కరించాల్సిన వీసీ, ఫారెన్ టూర్లలో ఉండటంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్లాన్​ లేకుండానే సెలవులిచ్చిన్రు..

ప్రభుత్వం ఏడేండ్ల తరువాత నోటిఫికేషన్లు రిలీజ్​ చేయడంతో స్టూడెంట్లంతా సంబురపడ్డరు. హాస్టల్స్​ లో ఉంటూ గట్టిగా ప్రిపేర్​ అయ్యేందుకు కోచింగ్ సెంటర్లలో కూడా జాయిన్​ అయ్యారు. కానీ అంతలోనే హాస్టల్స్ క్లోజ్ చేసి, స్టూడెంట్లకు సెలవులిచ్చారు. బలవంతంగా హాస్టల్స్​ ఖాళీ చేయించి, ఆన్ లైన్​లో క్లాసులు నడుపుతున్నారు. ప్రపోజల్స్, టెండర్ ప్రక్రియ దాటకుండానే హాస్టల్స్ ఖాళీ చేయించడంపై విద్యార్థి నాయకులు మండిపడుతున్నారు.

రూ.61.5 లక్షలతో టెండర్లు..

యూజీసీ న్యాక్​ గుర్తింపు కోసం క్యాంపస్​లో మౌలిక వసతుల కల్పన, బిల్డింగ్​ రిపేర్ల కోసం రూ.80 లక్షలు కేటాయించింది. ఇందులో రూ.61.5 లక్షల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల సమర్పణకు జూన్ 29 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. దశల వారీగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఎలాంటి ఎస్టిమేషన్స్ లేకుండానే ఇష్టారీతిన ఫండ్స్​ కేటాయించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

5 రోజుల్లో పనులైతయా?

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ప్రత్యక్షంగా తరగతులు నిర్వహిస్తున్నారు. కేయూలో మాత్రం బిల్డింగ్స్​ రిపేర్ల పేరున ఆన్​ లైన్​లోనే క్లాసులు నిర్వహిస్తుండటం పట్ల స్టూడెంట్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హాస్టల్స్​ తెరచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని డిమాండ్​ చేస్తూ.. ఈ నెల 20న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో రిజిస్ట్రార్​ బి.వెంకట్రామిరెడ్డి దిగి వచ్చి, జులై 4వ తేదీన హాస్టల్స్​ ఓపెన్​ చేస్తామని, లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు. కానీ టెండర్ల స్వీకరణకే జూన్​ 29 వరకు అవకాశం ఇచ్చారు. అనంతరం టెండర్లు ఖరారు చేసి, పనులు స్టార్ట్ చేయించడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కేయూ హాస్టల్స్​ ఇప్పట్లో ఓపెన్​ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అదే జరిగితే మరో ఉద్యమం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.

హాస్టల్స్ ఓపెన్ చేయకుంటే ఉద్యమిస్తాం

యూనివర్సిటీ ఆఫీసర్లు స్టూడెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జాబ్ ల కోసం ప్రిపేర్ అయ్యే టైమ్ లో ఎలాంటి ప్లాన్ లేకుండానే హాస్టల్స్ ఖాళీ చేయించిన్రు. మళ్లీ రీ ఓపెన్ చేయడానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. చెప్పిన టైమ్ లోగా హాస్టల్స్ ఓపెన్ చేయకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతాం. 
- భాషబోయిన వేణురాజ్, పీడీ ఎస్ యూ