దాదాపు రెండేండ్ల పాటు ఎన్నో కష్టాలు పెట్టింది కరోనా. ఎంతోమంది ఇండ్లకే పరిమితమైపోయారు. థర్డ్ వేవ్ తర్వాత కాస్త ధైర్యంగా కాలు బయట పెట్టగలిగారు. దాంతో ఎక్కువగా టూర్స్ వెళ్లేవాళ్లకు ప్రాణం లేచొచ్చింది. ఇదంతా ఓకే. కానీ..మహమ్మారి వల్ల టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది జాబ్స్ పోగొట్టుకున్నారు. కొన్ని వేల హోటల్స్ మూతబడ్డాయి. చాలాకాలం పాటు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు సర్వీసులను ఆపేశాయి. దాంతో ఎంతో నష్టం వచ్చింది. ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు హాస్పిటాలిటీ సెక్టార్‌లోని కంపెనీలన్నీ ధరలను ఓ రేంజ్లో పెంచేశాయి.
రేట్లు పెరిగాయంటే.. ఆటోమెటిక్‌గా టూర్ల ఖర్చులూ పెరుగుతాయి కదా! అచ్చం అలానే జరిగింది. దాంతో కాలు బయటపెట్టాలంటే ఖర్చు తడిసి మోపెడవుతోంది. రోడ్డు మీద తిరిగే ఆటో ఛార్జీల నుంచి గాల్లో ఎగిరే విమానాల టికెట్ల వరకు అన్నీ పెరిగిపోయాయి. అలాగని ట్రాన్స్‌పోర్టేషన్ ఒక్కటే కాదు హోటల్ గదుల రేట్లూ పెరిగాయి. ధరలు ఎంత పెరిగినా.. టూర్లకు గిరాకీ మాత్రం తగ్గడం లేదు. ఖర్చు ఎంతైనా సరే టూరేస్తాం అనేవాళ్ల సంఖ్య బాగానే ఉంది. కొందరైతే ఇప్పుడు ‘రివెంజ్’ మోడ్‌లో ఉన్నారు. ఇంట్లో ఉన్న రెండేండ్లలో వెళ్లలేకపోయిన ప్లేస్‌లతో పాటు ఈ ఏడు వెళ్లాల్సిన కొత్త ప్లేస్‌లను కూడా లిస్ట్‌లో చేర్చుకుంటున్నారు.
దాదాపు రెండేండ్ల క్రితం..అంటే మన జీవితాల్లో కరోనా అడుగుపెట్టి అతలాకుతలం చేసినప్పటి నుంచి లైఫ్ స్టైల్‌లో చాలా మార్పులు వచ్చాయి. కొవిడ్ వేరియంట్లను ఎదుర్కోవడం, పెరుగుతున్న ప్రాణ నష్టం, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, వ్యాక్సినేషన్ కష్టాలు.. ఇలా ఒక్కటేమిటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీదా పడింది. వీటివల్లే లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా ట్రావెలింగ్ పద్ధతులను కూడా మార్చేసింది. ఆ మార్పులకు అనుగుణంగా టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతలోనే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయినా.. మెజారిటీ జనం వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి పెద్దగా భయపడడం లేదు. ‘‘పదండి సరదాగా ఓ టూరేద్దాం” అంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్తున్నారు. దాంతో ట్రావెల్ రంగానికి ఊపిరి అందింది. ట్రావెల్ ఏజెన్సీలు, కంపెనీలు భవిష్యత్తు మీద భరోసా పెంచుకున్నాయి. ‘‘ఇకపై కొత్త వేరియెంట్లు వచ్చినా.. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ఉండదు. అందుకని టూర్స్ వెళ్లేందుకు ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే.. కొవిడ్ వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది’’ అంటున్నాడు హైదరాబాద్‌లో ట్రావెల్ ఏజెన్సీ నడిపే రాజు చెప్పాడు.
ట్రావెలింగ్‌లో మార్పులొచ్చాయ్
చాలా కంపెనీలు ఇప్పుడు వర్క్‌ఫ్రం హోమ్ అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇది ఎంప్లాయ్స్ టూర్లకు వెళ్లడానికి మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. ఈ కల్చర్ టూరిజం రంగానికి లాభాలు తెచ్చిపెడుతోంది. ఎయిర్ బీఎన్బీ జనరల్ మేనేజర్–ఇండియా అమన్‌ప్రీత్ బజాజ్ మాట్లాడుతూ.. ‘‘కరోనా తరువాత టూరిజం రంగం చాలా మారింది. ప్రజలు ట్రావెల్ చేసే విధానం కొత్తగా ఉంది. చాలామంది టూరిస్ట్ ప్లేస్ల్లోనే ఎక్కువ రోజులు ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రిమోట్ వర్కింగ్ ఛాన్స్‌ని బాగా వాడుకుంటున్నారు” అన్నాడాయన. ‘‘ప్రజలు వేగాన్ని తగ్గించి, జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నారు” అని మేక్ మైట్రిప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ ప్రకాష్ చెప్పాడు. గతంలో టూర్‌ని బుక్ చేయడానికి ఏ తేదీల్లో అవైలబిలిటీ ఉందో చూసుకుని కొన్ని రోజుల ముందుగానే ఆ తేదీల్లో బుక్ చేసుకునేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఇన్స్టంట్ గెటెవేస్ టూర్లను అందించే ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలు పెరిగాయి. దాంతో ఇన్‌స్టంట్‌టూర్లను ఎంపిక చేసుకునేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
అయితే.. ఎక్కువమంది మాత్రం వీకెండ్స్‌లో టూర్స్ వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. ఇదివరకు చాలా తక్కువమంది వెళ్లే టూరిస్ట్ ప్లేస్‌లకు కూడా ఈ సంవత్సరం డిమాండ్ పెరుగుతోందని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. కొందరయితే ‘‘హాలిడే హోమ్’’, ‘‘మౌంటెన్స్ పై స్పెషల్ హోమ్‌స్టే”లాంటి స్పెషల్‌టూర్ల కోసం ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. బర్త్ డే, ప్రమోషన్స్, రీయూనియన్‌లాంటి స్పెషల్ ఈవెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా టూర్స్‌కు వెళ్తున్నారని థామస్ కుక్ ఇండియా కంపెనీకి చెందిన కాలే చెప్పాడు. దీనివల్ల లోకల్ టూరిస్ట్ స్పాట్లకు కూడా రద్దీ పెరుగుతోంది. ఇలాంటి ఈవెంట్స్‌ఎక్కువగా ఇంటినుంచి 300 కిలోమీటర్లలోపు ఉన్న టూరిస్ట్ లొకేషన్లలో చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వీటితో పాటు ‘‘మైండ్‌ఫుల్ హాలిడేస్’’, ‘‘సెల్ఫ్-కేర్ ట్రిప్స్’’ లాంటి కొత్త రకం ట్రిప్‌లూ పెరిగాయి. మానసిక ఆరోగ్యం కోసం ఇలాంటి టూర్లు చేస్తున్నారు. కొవిడ్ వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు ఇలాంటి టూర్స్ చేస్తున్నారు. అంతేగాక 2022లో జంగిల్ అడ్వెంచర్లు, వైల్డ్‌లైఫ్ సఫారీలు, క్రూయిజ్ టూర్లకు గిరాకీ బాగుందని టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. ఈ ఏడు టూర్లకు వెళ్తున్నవాళ్లలో ఎక్కువగా కుటుంబాలు, మిలెన్నియల్స్, యూత్, కపుల్స్ ఉన్నారు.
కారవ్యాన్ షికార్
రైళ్లు, విమానాలు, బస్సులకు బదులు కారవ్యాన్లలో టూర్స్ వెళ్లేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి వెహికల్స్ అమ్మకాలు ఇండియాలో ఈ మధ్య బాగా పెరిగాయి. గడిచిన ఒకటిన్నర ఏండ్లలో కారవ్యాన్ రెంట్ సర్వీసుల కంపెనీలు కూడా పెరిగాయి. ఈ కారవ్యాన్లలో వంటగది, పాత్రలు, నీళ్లు, వాష్‌రూమ్, క్యాంపింగ్ టెంట్లు, పోర్టబుల్ మ్యూజిక్ స్పీకర్, దిండ్లు, క్విల్ట్ వంటివి ఉంటాయి. ఫైన్ కారవ్యాన్ అనే సంస్థ ఐదుగురుకి సరిపోయే కారవ్యాన్లకు రోజుకు ఆరు వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తోంది.
ఎక్కడికి వెళ్తున్నారంటే...
మన దేశంలో ఉన్న కర్జాత్, మషోబ్రా, పహెల్గాం, షిమోగా, ముక్తేశ్వర్.. లాంటి టూరిస్ట్‌ప్లేస్‌లు చాలామందికి తెలియదు. కానీ.. ఇప్పుడు ఈ ప్లేస్‌లకు కూడా చాలామంది వెళ్తున్నారు. బిర్, వర్కలా, కసోల్, హంపి, తీర్థన్ వ్యాలీ, అరకు లోయ, పంచగనికి కూడా టికెట్ల బుకింగ్ పెరిగింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్, ఉత్తరాఖండ్‌లోని ఫ్లవర్స్ వ్యాలీ, లడఖ్‌లోని త్సోమోరిరి సరస్సు, ఉత్తర సిక్కిం, రాజస్తాన్‌లోని కియోలాడియో లాంటి ఇతర ఆఫ్‌బీట్ డెస్టినేషన్స్ ఇప్పుడు టూరిస్ట్‌లతో కళకళలాడుతున్నాయి. ఒరిస్సా, ఈశాన్య ప్రాంతాలను చూసేందుకు ఎంక్వైరీలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ టూరిజం విషయానికొస్తే, దుబాయ్, యూరప్, అమెరికా, కెనడా వంటి దేశాలకు ఎక్కువమంది వెళ్తున్నారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, మారిషస్, టర్కీ, ఈజిప్ట్ మాల్దీవులకు కూడా గిరాకీ బాగానే ఉంది.
హోటల్స్ రేట్లూ పెరిగాయి
కొవిడ్ ముందురోజులతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల హోటళ్ల టారిఫ్‌లు 30 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. స్టార్ట్ హోటల్స్‌లో ఉండటానికి మెజారిటీ టూరిస్టులు ఇష్టపడుతున్నారు. ప్రి–కొవిడ్ టైంతో పోలిస్తే అల్ట్రా ప్రీమియం సూపర్ -లగ్జరీ హోటళ్ల విభాగంలో 100 శాతానికి పైగా గ్రోత్ ఉంది. ప్రీమియం విభాగం మునుపటితో పోల్చితే కరోనా తరువాత 40 శాతం పెరిగింది.
ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని వయసుల వాళ్లు, విలాసవంతమైన ట్రావెలింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోరుకుంటున్నారు. అందుకే ప్రీమియం హోటళ్లకు గిరాకీ పెరుగుతోంది. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంటే మన దేశంలో ఎక్కువమందికి తెలియని ప్లేస్‌లకు వెళ్లడానికే కొందరు ఇష్టపడుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్హెచ్ఆర్ఏఐ) ప్రకారం.. మొదటి వేవ్ టైంలో నష్టాల వల్ల మన దేశంలోని దాదాపు 40 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. మిగిలిన వాటిలో చాలావరకు నష్టాలతో నడుస్తున్నాయి.
టారిఫ్ కూడా..
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత హాస్పిటాలిటీ రంగం కోలుకుంటున్నది. దేశవ్యాప్తంగా హోటళ్లలో ఆక్యుపెన్సీ లెవెల్స్ కరోనా కంటే ముందు రోజుల్లో ఉన్నట్టే ఉన్నాయి. టూరిస్ట్ డెస్టినేషన్ హోటళ్లలో టారిఫ్‌లు బాగా పెరిగాయి. హిల్టన్, రాడిసన్, లెమన్ ట్రీ వంటి స్టార్ హోటళ్లలో గదులు, సూట్ల రేట్లు ప్రి–కొవిడ్ ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్నాయి. రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఏషియా, వైస్ ప్రెసిడెంట్-ఆపరేషన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జుబిన్ సక్సేనా మాట్లాడుతూ “ఈఏడాది సమ్మర్‌లో హఠాత్తుగా డిమాండ్ కనిపించింది. ప్రయాణాలు పెరిగాయి. హాలిడే, వ్యాపారం.. ఈ రెండింటి కోసం ఇండియాలో ఉన్న మా 108 హోటళ్లలో ఆక్యుపెన్సీ రేట్2019 నాటి స్థాయికి చేరింది. ఢిల్లీ, ముంబై, లోనావాలా, ధర్మశాల, ముస్సోరి, సిమ్లా వంటి చోట్ల పూర్తిస్థాయి రికవరీ ఉంది. రాబోయే రోజుల్లో బలమైన డిమాండ్ ఉంటుంది అనుకుంటున్నాం” అని చెప్పాడు. “డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది మార్చిలో దేశంలో సగటు రేట్లు రూ.5,400 నుంచి 5,600 వరకు ఉన్నాయి. సంవత్సరం లెక్కన ఇది 37-39శాతం పెరుగుదల ఉంది’’ అంటున్నాడు రీసెర్చ్ ఫర్మ్ అనరాక్కు చెందిన మన్‌దీప్ లాంబా. ‘‘ఈ ఏడాది మొదటి మూడు రోజుల్లో పెండ్లి తేదీలతో పాటు కార్పొరేట్ ఈవెంట్స్ ఎక్కువగా ఉండటంతో గదులు, సూట్స్, కన్వెన్షన్ సెంటర్లు నిండిపోయాయి. ఇక నుంచి మా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్టే’’ అంటున్నాడు లెమన్‌ట్రీ సీనియర్ ఎగ్జిక్యూటివ్.
థర్డ్ వేవ్ తరువాత శ్రీనగర్, ఉదయ్‌పూర్, గోవా, గాంగ్‌టక్, కార్బెట్, చండీగఢ్, బాంధవ్‌గఢ్, మనేసర్, జైపూర్, కత్రా అమృత్‌సర్‌లోని లీజర్ పోర్ట్‌ఫోలియోలలో ఆక్యుపెన్సీ స్పీడ్‌గా రికవరీని సాధించింది. మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్ ప్రి–కొవిడ్‌లో ఎలాగైతే జరిగాయే అలానే ఇప్పడూ జరుగుతున్నాయి. ఇప్పటివరకు వెనుకబడిన గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు ఇప్పుడు పుంజుకుంటున్నాయి. థామస్ కుక్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. ‘‘పాపులర్ హిల్ స్టేషన్‌ల సగటు గది రేట్లు కరోనా ముందు ఉన్న స్థాయిల కంటే 30-40శాతం పెరిగాయి. అయితే బీచ్ సిటీల్లో టారిఫ్ సుమారు 30 శాతం పెరిగింద’’ని చెప్పాడు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూనే వంటి కీలక మెట్రో నగరాల్లో ధరలు కొవిడ్‌కు ముందు స్థాయిలో ఉన్నాయి. తిరుపతి, రిషికేశ్, కాశీ వంటి ఆధ్యాత్మిక టూరిస్ట్ స్పాట్లలో కూడా గదుల ధరలు 10- నుంచి 15శాతం పెరిగాయి. హాలిడే డెస్టినేషన్ ప్రాంతాల్లో సగటు గది టారిఫ్‌ల్లో ప్రీ పాండెమిక్ స్థాయిలతో పోల్చితే 40శాతం పెరుగుదల ఉందని మరో టూర్ ఆపరేటర్ ఎస్ఓటీసీ తెలిపింది. ప్రస్తుతానికి సిటీ హోటళ్ల ధర కూడా మహమ్మారికి ముందు స్థాయిలతో సమానంగా ఉంది. ఇండస్ట్రీ ట్రాకర్ ఎస్టీఆర్ డేటా ప్రకారం, భారతదేశ హోటల్ పరిశ్రమ ప్రి–కొవిడ్ స్థాయిల్లో ఉంది. ఆక్యుపెన్సీ, యావరేజ్ డే రేట్స్ (ఏడీఆర్) రెండూ 2019 స్థాయిలను దాటాయి.
తిండి ఖర్చులు మస్తు పెరిగినయ్
పప్పులు, నూనె, మసాలాలు.. ఇలా ప్రతి ఒక్క దాని ధర పెరగడంతో థర్డ్ వేవ్ ముగిశాక రెస్టారెంట్లలో రేట్లు పెరిగాయి. మరో సంగతి ఏంటంటే.. జనం బయట తినడం తగ్గించారు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పొదుపు పెంచారు. పీక్ బిజినెస్ అవర్స్‌లో కూడా చాలా రెస్టారెంట్స్‌లో టేబుల్స్ కోసం వెయిటింగ్ టైం చాలా తక్కువగా ఉంటోంది. లేబర్, ఆహార ధాన్యాల వంటి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో రేట్లను పెంచాల్సి వచ్చిందంటున్నారు. ‘‘లాభాలను పెంచుకునేందుకు రేట్లను 3-4 శాతం దాకా పెంచాల్సి వచ్చింది. ఇడ్లీ, వడ, పూరి వంటి బ్రేక్‌ఫాస్ట్ రేట్లు కనీసం ఐదు రూపాయలు పెంచామ’’ని ఉడిపి హోటల్ నిర్వాహకుల్లో ఒకరు చెప్పారు.
హైదరాబాద్‌లోని దాదాపు అన్ని రెస్టారెంట్లు బిర్యానీ, కబాబ్, థాలీల రేట్లను బాగానే పెంచాయి. రేట్ల పెరుగుదల ఒక్కో రెస్టారెంటుకు ఒక్కోలా ఉంది. అన్ని మెట్రో సిటీల్లోనూ ఇదే పరిస్థితి. ఢిల్లీలోని చా బార్ మేనేజర్ పునీత్ కనోజియా మాట్లాడుతూ ‘‘టేబుల్స్ కోసం వెయిట్ చేసే టైం చాలా తగ్గింది. కొన్ని నెలలుగా వెయిటింగ్ పీరియడ్ ముప్పావుగంట నుంచి పావుగంటకు పడిపోయింది. వంటల ధరను ఒక్కొక్కటి రూ. 20 చొప్పున పెంచామ’’ని చెప్పాడు.
ఇదిలా ఉంటే... రేట్లు పెంచడం వల్ల కస్టమర్లు తగ్గారు అంటున్నాడు హల్దీరామ్ బ్రాంచ్ మేనేజర్. దాబాల్లో పది నెలల క్రితం రాజ్మా రిటైల్ ధర రూ.95 కాగా ఇప్పుడు అది రూ.155లకు చేరింది. చోళే మసాలా రూ.80 నుంచి ఇప్పుడు రూ.110 అయింది. దాల్‌మఖానీ వంటి వాటి రేట్లు రూ.100 నుంచి రూ. 120 లకు పెరుగుతున్నాయి. ‘‘నా కస్టమర్స్‌లో కొందరు ఇదివరకు ఒక ప్లేట్ రైస్ ఆర్డర్ చేసేవారు. ఇప్పుడు తక్కువ ఆర్డర్ చేసి ఫుడ్ షేర్ చేసుకుంటున్నారు’’ అన్నాడాయన. కొందరు మాత్రమే తమ రెస్టారెంట్లలో వెయిటింగ్ పీరియడ్ తగ్గలేదన్నారు. ఈ విషయం గురించి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కబీర్ సూరి మాట్లాడుతూ ‘‘వంట నూనెలు, ఫ్యూయల్, మాంసం, కూరగాయలు, దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నామన్నారు.
విమాన ఛార్జీలు ...
కొవిడ్ తరువాత డొమెస్టిక్ ట్రావెలర్స్ రద్దీ, ఇంధన ధరలు పెరగడంతో విమాన ఛార్జీలు 30 శాతం నుండి 100 శాతం వరకు పెరిగాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్ కంపెనీలు 100 శాతం కెపాసిటీతో పనిచేస్తుండడంతో ఇక మీదట కూడా విమాన ఛార్జీలు తగ్గే అవకాశం లేదంటోంది థామస్ కుక్. కరోనా సెకండ్ వేవ్ వల్ల పోయినేడు మే నెలలో దేశీయ ట్రాఫిక్ తగ్గింది. తరువాతి నెలల్లో క్రమంగా పెరిగింది. ప్రయాణాలు విపరీతంగా పెరగడం వల్ల టికెట్లకు డిమాండ్ ఉంది. కొవిడ్‌కు ముందు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమాన టికెట్ ధర మూడు వేల రూపాయల్లోపు ఉండేది. ఇప్పుడు అది ఎనిమిది వేల రూపాయల వరకు ఉంది. అహ్మదాబాద్ నుండి అండమాన్ (పోర్ట్ బ్లెయిర్)కి ఫ్లైట్ టికెట్ 100 శాతం పెరిగింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ టికెట్ ధర 50 శాతం పెరిగింది. ముంబై, చెన్నై, కోల్‌కతా నుంచి ఇతర సిటీలకు వెళ్లేందుకు టికెట్ ధరలు 30 శాతం పెరిగాయి. చాలామంది ఫేవరెట్ డెస్టినేషన్ గోవా కావడంతో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నుంచి వెళ్లే ఫ్లైట్ టికెట్ రేట్లు10 నుంచి -30 శాతం, అహ్మదాబాద్ నుంచి 50 శాతం వరకు పెరిగాయి. ముంబై, బెంగళూరు కోల్‌కతా నుండి కాశ్మీర్‌కు 5 నుండి 10 శాతం వరకు పెరిగాయి. క్రిస్మస్, -న్యూ ఇయర్ లాంటి పీక్ సీజన్‌లో అండమాన్, నగర్, గోవా, జైపూర్ ఉదయ్‌పూర్ వంటి ఫేవరెట్ స్పాట్‌లకు ఫ్లైట్ ఛార్జీలు పెరగడం మామూలేనని ఆపరేటర్లు చెప్తున్నారు.
ఇతర ఖర్చులూ...
ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల) వల్ల తిండి ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. 2019 మార్చిలో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 76 రూపాయలు ఉండేది. ఇప్పుడది 109 రూపాయలు దాటింది. డీజిల్ 72 రూపాయలకు లీటరు ఉండేది. ఇప్పుడు 98 రూపాయలకు చేరింది. ట్యాక్సీ, బస్, ఆటో ఛార్జీలు కూడా 30 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. రైలు ఛార్జీల్లో మాత్రం ఏ మార్పు లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం వల్ల కొన్ని సిటీల్లో ఆటో ఛార్జీలు 40 శాతం వరకు పెరిగాయి. ఉబర్, ఓలా, ర్యాపిడో లాంటి ట్యాక్సీ సర్వీస్ కంపెనీలు కూడా టారిఫ్‌లను పెంచాయి. ఇదంతా ఇలా ఉంటే కొవిడ్ పరిస్థితుల తరువాత మెడిటేషన్ టూర్స్ బాగా పెరిగాయి.
మెడిటేషన్ టూర్లు
మామూలు అడ్వెంచర్, కల్చరల్ టూర్లతో పాటు.. రెండేండ్లుగా ఇండియాలో కొత్త తరహా పర్యాటక రంగం డెవలప్ అయింది. అదే ‘వెల్‌నెస్ టూరిజం’. 2020లో ప్రపంచంలోని టాప్ 20 టూరిజం మార్కెట్లలో మన దేశం 12వ స్థానంలో నిలిచింది. కేవలం ఆనందం కోసం మాత్రమే కాకుండా ప్రశాంతత కోసం కూడా మన దేశంలో టూర్లకు వెళ్తున్నారు. మెడిటేషన్ సెంటర్లకు వేల మంది టూరిస్టులు వెళ్తున్నారు. యోగా, ధ్యానాన్ని సాధన చేస్తున్నారు. మన దగ్గరున్న కొన్ని బెస్ట్ మెడిటేషన్ రిట్రీట్ చాయిస్‌లు ఇవి.
కన్హ శాంతి వనం : కన్హ శాంతి వనం హైదరాబాద్ 1,200 ఎకరాల్లో ఉంది. దీన్ని హార్ట్‌ఫుల్ మెడిటేషన్ సెంటర్ అని కూడా పిలుస్తుంటారు. రాజయోగం విధానంలో ధ్యానం నేర్పిస్తారు. ఇక్కడ ఒకేసారి లక్ష మంది ధ్యానం చేయొచ్చు. ధ్యానంతో పాటు మొక్కల పెంపకం, నీటి సంరక్షణ లాంటి వాటిపై అవగాహన కల్పిస్తారు.
ఓషో ఇంటర్నేషనల్ మెడిటేషన్ రిసార్ట్ : ఇది పూనే నడిబొడ్డున ఉంది. ఎక్కడ చూసినా పచ్చదనం, విశాలమైన ఖాళీ స్థలం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. దీన్ని 28 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సెషన్లు మొదలవుతాయి. రోజుకు 10 సెషన్లు ఉంటాయి. ధ్యానంతోపాటు బాడీ మసాజ్, స్విమ్మింగ్, మెడిటేషన్ వర్క్‌షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.
ఆరోవిల్లె : ఆరోవిల్లెలో ఒకేసారి దాదాపు 200 మంది ధ్యానం చేయొచ్చు. ఇది పుదుచ్చేరిలో ఉంది.
పరమార్థ నికేతన్: రిషికేశ్‌లోని హిమాలయాల్లో ఉద్యానవనాల మధ్య పరమార్థ నికేతన్ ఉంది. యోగ, ధ్యానంపై దృష్టి పెట్టాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ ప్రతిరోజు గంగా హారతి, సూర్యాస్తమయ ప్రార్థనలు జరుగుతుంటాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ : ఈ కేంద్రం కర్నాటకలోని పంచగిరి కొండల్లో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
విపాసనా ఇంటర్నేషనల్ అకాడమీ : దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమనే పేరు ఉంది. ఇగత్‌పురిలో ఉన్న ఈ సెంటర్లో స్వీయ పరిశీలన అభ్యాసాన్ని నేర్చుకోవచ్చు.
ఈశా యోగా కేంద్రం: సద్గురు ప్రారంభించిన ఈ ధ్యాన కేంద్రం.. దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి.
బీచ్‌లు, హిల్ స్టేషన్లు, చారిత్రక కట్టడాల వంటి టూరిస్టు లొకేషన్లకు మన దేశంలో కొదవ లేదు. ప్రతి రాష్ట్రమూ ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. సరైన పబ్లిసిటీ, డెవలప్‌మెంట్ లేకపోవడం వల్ల టూరిజం సెక్టార్ వెనకబడింది. కానీ.. టూరిజం డెవలప్‌మెంట్‌కు మన దేశంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు కనెక్టివిటీ పెరిగింది. మన దగ్గర 140 ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. వాటిలో 20 ఎయిర్‌పోర్టులకు ఇంటర్నేషనల్ టేకాఫ్, ల్యాండింగ్ కెపాసిటీ ఉంది. దేశంలో ప్రతి రోజూ కొత్తగా 36 కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నారు. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ మనకే ఉంది. కానీ.. విమాన టికెట్ల ధరలు పెరగడంతో టూరిస్ట్‌లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. దేశీయ విమానాల్లో ట్రావెలింగ్ ఖర్చుతో కూడుకున్న పని. టికెట్ల ధరలు తగ్గాలంటే విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.
ఏబీ రమేశ్
టికెట్ల ధరలు..
రష్యా నా ఫేవరెట్ కంట్రీ. తరచూ వెళ్తుంటా. ఈ ఏడాది జనవరిలోనూ వెళ్లా. నెల రోజులు ఉన్నా. విమాన టిక్కెట్ల ధర దాదాపు 25 శాతం పెరిగింది. ప్రి –కొవిడ్ టైంలో ఢిల్లీ నుంచి మాస్కో వెళ్లడానికి టికెట్ ధర పాతిక వేల రూపాయల నుంచి 35,000 వరకు ఉండేది. కొవిడ్ తర్వాత ధరలు 35,000 నుంచి 45,000 రూపాయలకు పెరిగింది. కొవిడ్ వల్ల మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని చాలా హోటళ్లలో గదులు ఖాళీగా ఉన్నాయి. అందుకే ధరల విషయంలో అంత మార్పు లేదు. వీసా ఖర్చులు మాత్రం 3,000 రూపాయల వరకు పెరిగాయి. లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ రేట్లు కూడా రెట్టింపు అయ్యాయి. ఐదు కిలోమీటర్ల టాక్సీ రైడ్‌కు కొవిడ్‌కు ముందు 600 రూపాయలు తీసుకునేవాళ్లు. ఇప్పుడు దాదాపు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు. ట్రైన్ ఛార్జీలు కూడా 30 శాతం పెరిగాయి. ఫుడ్ ధరలు 30 శాతం పెరిగాయి. డ్రింక్స్ ధరల్లో మాత్రం పెద్దగా తేడాల్లేవు. మొత్తం మీద కొవిడ్ తర్వాత 30 నుండి 35 శాతం ధరలు పెరిగాయి. ఇంతకుముందు లక్ష రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు 1.4 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
– శైలేష్ కూటూరు, హైదరాబాద్
20 నుంచి 40 శాతం...
ఇండియాలో నా ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్ గోవా. ప్రతి ఏడాది ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తుంటా. ఈ జూన్‌లో కూడా ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి గోవా వెళ్లి, నాలుగు రోజులు ఉన్నా. హైదరాబాద్‌కు దగ్గరే కాబట్టి మా కారులోనే వెళ్లాం. కానీ, ధరలు విపరీతంగా పెరిగాయి. లీటరు డీజిల్ రేటు రెండేండ్లలో 80 రూపాయల నుంచి 100కి చేరింది. రెండేండ్ల కింద డీజిల్‌కు ఏడు వేలు ఖర్చయితే ఈ సారి మాకు 10 వేల పైనే అయింది. ప్రస్తుతం గోవాలో కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేదు. అన్ సీజన్ కావడంతో హోటల్ రూమ్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్ తక్కువ ధరలకే దొరికాయి. రెండేండ్ల కిందట సీజన్‌లో (నవంబర్–జనవరి) డబుల్ బెడ్ రూమ్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు రోజుకు 3,000 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే రేటు ఉంది. సీజన్‌లో అయితే ఐదు వేల పైనే ఛార్జ్ చేస్తారు. ఫుడ్, లిక్కర్ ధరలు కూడా దాదాపు 20 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. బీచ్‌లోని హోటల్స్‌లో ఫుడ్ ఐటమ్స్‌తో పాటు వాటర్ స్పోర్ట్స్, ఇతర టూరిస్ట్ స్పాట్లలో కూడా రేట్లు పెంచారు. ఇంతకు ముందు నలుగురం గోవాకు వెళ్తొస్తే 40 వేల లోపు ట్రిప్ పూర్తయ్యేది. కానీ, ఈసారి మా ట్రిప్ ఖర్చు రూ. 60 వేలు దాటింది.
– రత్నగారి ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్
డొమెస్టిక్ ట్రావెలింగ్
- ఇండియాలోని ఒక వ్యక్తి సగటున ఒకటిన్నర సార్లు డొమెస్టిక్ టూర్లకు వెళ్తాడు. అదే అమెరికాలో అయితే.. ఒక వ్యక్తి సంవత్సరంలో ఆరు సార్లు టూర్లకు వెళ్తుంటాడు. చైనాలో నాలుగు సార్లు. ఈ లెక్కన చూస్తే ఇండియాలో డొమెస్టిక్ టూరిస్ట్‌ల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి డొమెస్టిక్ టూరిస్ట్‌ల సంఖ్య పెరగాలంటే ఇండియాలోని టాప్- 20 టూరిస్ట్ స్పాట్‌లను ప్రపంచ స్థాయి టూరిస్ట్ అట్రాక్షన్స్‌గా డెవలప్ చేయాలి.
- టూరిజం సెక్టార్‌కు దూరంగా ఉండే రాష్ట్రాల్లోని టూరిస్ట్ స్పాట్‌లకు ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యాన్ని పెంచాలి. పబ్లిసిటీ చేయాలి.
- కొవిడ్ తర్వాత మొదలైన‘బ్లీజర్ ట్రావెల్’ను ఎంకరేజ్ చేయాలి. పనితో పాటు విశ్రాంతి తీసుకోవడమే బ్లీజర్ ట్రావెల్ స్పెషాలిటీ. ఇంటి నుండి పని చేసే అవకాశం ఉన్న వాళ్లలో చాలామంది ఇలాంటి టూర్స్‌కు వెళ్తున్నారు.
- అడ్వెంచర్ టూరిజం కోసం రోడ్‌మ్యాప్ డెవలప్ చేయాలి. 365 రోజులు టూరిస్ట్‌లు మనదేశానికి వచ్చేలా చేయాలి. టూరిస్ట్‌లను ఎట్రాక్ట్ చేసేందుకు ఈవెంట్స్ ప్లాన్ చేయాలి.
