హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గురువారం అసెంబ్లీ ఆవరణలోని మంత్రి కార్యాలయంలో డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) అధ్యక్షుడు బొల్లోజు రవి, ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్‌ను కలిసి తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మెమోరాండం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ విషయంపై సీఎంతో తాను మాట్లాడతానన్నారు.
ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్ గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డీజేహెచ్‌ఎస్ అని ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల చిరకాల స్వప్నం సొంతిల్లని, వారి కల సాకారం చేయాలని మంత్రిని కోరారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే ఖమ్మం, రంగా రెడ్డి, వరంగల్ తదితర జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించారన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర రాజధాని కేంద్రంగా హైదరాబాద్ జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న డీజేహెచ్‌ఎస్ సభ్యులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీజేహెచ్‌ఎస్ డైరెక్టర్లు డేగ కుమార్, ప్రతాప్ రెడ్డి, దండా రామకృష్ణ, సలహాదారు విక్రమ్ రెడ్డి, సభ్యులు వేములప రాజు, పోలంపల్లి ఆంజనేయులు పాల్గొన్నారు.

