యాక్సిడెంట్ చేసి పారిపోతే..ఏఐ పట్టిచ్చింది!

యాక్సిడెంట్ చేసి పారిపోతే..ఏఐ పట్టిచ్చింది!
  • 36 గంటల్లో కేసును ఛేదించిన నాగ్​పూర్ పోలీసులు 

నాగ్ పూర్: మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టి, పారిపోయిన ట్రక్​ డ్రైవర్​ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఘటన జరిగిన 36 గంటల తర్వాత 700 కిలోమీటర్ల దూరంలో అతడిని అరెస్ట్ చేశారు. 

మధ్యప్రదేశ్​కు చెందిన భార్యాభర్తలు ఈ నెల 9న రాఖీ పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి బైకుపై వెళ్తుండగా నాగ్​పూర్​లో ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ మహిళ కిందపడ్డా ట్రక్కును డ్రైవర్ అలాగే ఆమె మీదుగా నడుపుకుంటూ పారిపోయాడు. ఆ తర్వాత తన భార్య డెడ్ బాడీని ఆ భర్త అదే బైకుపై వేసుకుని సొంత ఊరికి బయలుదేరిన ఘటన వైరల్ అయింది. 

అయితే,  ఓ ట్రక్కు వచ్చి ఢీకొట్టిందని, దానిపై రెడ్ మార్క్స్ ఉన్నాయని.. అంతకుమించి ఏమీ అతడు పోలీసులకు చెప్పలేకపోయాడు. దీంతో ఏఐ టెక్నాలజీని వాడి కేసును ఛేదించామని నాగ్​పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఆదివారం వెల్లడించారు. 

‘‘హైవే మీదుగా ఉన్న మూడు టోల్ ప్లాజాల వద్ద సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను ఏఐ అల్గారిథం రెండు రకాలుగా విశ్లేషించింది. ముందుగా రెడ్ మార్క్స్ ఉన్న ట్రక్కులను వేరు చేసింది. తర్వాత యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి ఏ ట్రక్కు, ఎంత సేపటికి అక్కడి చేరిందో అంచనా వేసి, యాక్సిడెంట్ చేసిన ట్రక్కును గుర్తించింది. 

దీంతో నాగ్​పూర్​కు 700 కిలోమీటర్ల దూరంలో గ్వాలియర్–కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఆ ట్రక్కును ఆపి, నిందితుడిని అరెస్ట్ చేశారు” అని ఎస్పీ వివరించారు. కాగా, మహారాష్ట్రలో దేశంలోనే తొలిసారిగా పోలీస్ డిపార్ట్‌‌ మెంట్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అవసరాల కోసం ప్రత్యేకంగా ఏఐ టెక్నాలజీ విభాగాన్ని ప్రవేశపెట్టారు.