
అమెరికా, చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా కొద్దిరోజుల క్రితం చైనా తన ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ ఎగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా తమపై విధించిన వాణిజ్య ఆంక్షలు, సుంకాలను ఎదుర్కొనాలని భావిస్తోంది. చైనా నిర్ణయంతో ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయి. ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ అంటే అరుదైన భూమి ఖనిజాలు.
‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ మొత్తం సంఖ్య పదిహేడు. అవి పదిహేను 4ఎఫ్ బ్లాక్‌కు చెందిన ‘లాంథనైడ్స్’ మూలకాలు (లాంథనం మూలకం నుంచి లుటేషియం మూలకం వరకు), 3వ బ్లాక్ కు చెందిన ‘స్కాండియం’ మూలకం, 4 బ్లాక్‌కు చెందిన ‘యట్రియం’ మూలకం. పదిహేడు మూలకాలు వేరువేరు బ్లాకులకు చెందినవి అయినప్పటికీ వీటన్నిటిని కలిపి ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ అని పిలుస్తారు. దీనికి కారణం ఇవన్నీ ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉండటం, ఒకే ధాతువు నిక్షేపాలలో కలిసి భూమిలో లభించటం, ప్రకృతిలో వాటి దగ్గరి సంబంధం, సారూప్య ప్రవర్తన కారణంగా వీటిని ఒకే సమూహంలో చేర్చటం జరిగింది.
‘రేర్ ఎర్త్’ అనగా భూమిలో అరుదుగా లభించేవి. ఈ పదం కొంచెం తప్పు పేరు. ఎందుకంటే ‘రేర్ ఎర్త్’ అనే పదం ఈ మూలకాలను మొదట కనుగొన్నప్పుడు ఇవి భూమిలో అరుదుగా లభిస్తాయి అనే భావనతో వీటిని ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ అని పేరు పెట్టారు. వాస్తవానికి ఈ మూలకాలన్నీ భూమి పైపొరలలో అధిక మొత్తంలో లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. చారిత్రక పేరు సంప్రదాయాల కారణంగా వీటిని ఇప్పటికీ ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ అని పిలుస్తున్నారు. ఉదాహరణకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మూలకమైన సీరియం భూమిలో రాగివలె సమృద్ధిగా లభిస్తుంది (అత్యంత సమృద్ధిగా దొరికే 25వ మూలకం), రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మూలకం థులియం కూడా బంగారం కంటే ఎక్కువగా లభిస్తుంది.
‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ధర్మాలు ఒకేలా ఉండటం వలన భూమిలో ఇవి కలిసి లభిస్తాయి. కావున 1907 వరకు వీటిని ఒకే మూలకం అని భావించారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను సంగ్రహించడం కష్టతరంగా ఉంటుంది, ఎందుకంటే వీటి రసాయన ధర్మాలు ఒకేలా ఉండటం వలన వీటిని వేరు చేయడానికి ఖరీదైన, బహుళ-దశల ప్రక్రియలు అవసరం. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం మైనింగ్ చేసిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(ఆర్ఈఈ) ఉత్పత్తిలో 60% కంటే ఎక్కువ ఒకే ఒక దేశం చైనా నుండి వస్తుంది. అంతేకాకుండా, ప్రాసెసింగ్ చేసిన REE లను ప్రపంచవ్యాప్తంగా చైనా 90% కంటే ఎక్కువ నియంత్రిస్తుంది. 1990ల చివరి నుంచి ప్రపంచంలోని ఆర్ఈఈలలో 85–95 శాతం చైనా అందించింది.
చైనా ఎలా అగ్ర స్థానం సాధించింది ?
చైనా వెలుపల కూడా వివిధ దేశాలలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభిస్తాయి. కానీ, సమస్య ఏమిటంటే ఈ దేశాలలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్ అంతగా చేయడం లేదు. దీనికి కారణం ఆర్థిక సాధ్యత సమస్యలతోపాటు, మైనింగ్ కలిగించే కాలుష్యం, పర్యావరణ ఆందోళనలు. అయితే, చైనాలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్తోపాటుగా సాంకేతికత- ఇంటెన్సివ్
ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది. చైనా ఈ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్న దశాబ్దాల తర్వాత ఈ చర్య బలమైన వాణిజ్య పరపతిగా లాభాలను ఇస్తోంది. 21వ శతాబ్దంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ప్రాచుర్యంలోనికి వచ్చాయి. ఎందుకంటే, ఒకటి.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌లో ఆధునిక సాంకేతికతకు దోహదపడే కీలకమైన, ప్రత్యేక లక్షణాలను గుర్తించటం. రెండు.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తి, సరఫరాలో చైనా ఆధిపత్యం. మూడు.. ప్రపంచంలోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సరఫరాలో ఎక్కువ భాగం చైనాపై అంతర్జాతీయ సమాజం ఆధారపడటం.
రేర్ ఎర్త్ మాగ్నెట్స్
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇతర మూలకాలతో కలిసి ఏర్పరిచే మిశ్రమ లోహాలు అత్యంత శక్తిమంతమైన అయస్కాంత పదార్థాలు. ఇవి వివిధ రంగాలలో ఉపయోగపడతాయి. ఉదాహరణకు బోరాన్, ఇనుములకు నియోడైమియం అనే ‘రేర్ఎర్త్ ఎలిమెంట్' కలిపితే ఏర్పడే మిశ్రమ లోహం అత్యంత శక్తిమంతమైన అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటుంది. రక్షణ పరికరాలు, ఎలక్ట్రిక్ మోటార్లు, యుద్ధ విమానాలు, కార్లలో పవర్ విండోలు, ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చడానికి ఈ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు కలిగిన టాప్ టెన్ దేశాలు, 2024లో వివిధ దేశాలు ఉత్పత్తి చేసిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డేటా అమెరికా జియోలాజికల్ సర్వే నుంచి తీసుకోవడం జరిగింది.
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వల్లో టాప్ టెన్ దేశాలు
1. చైనా నిల్వలు: 44 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఉత్పత్తి 2,70,000 మెట్రిక్ టన్నులు. 2. బ్రెజిల్ నిల్వలు: 21 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఉత్పత్తి 20 మెట్రిక్ టన్నులు. 3. భారతదేశం నిల్వలు: 6.9 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఉత్పత్తి 2,900 మెట్రిక్ టన్నులు. 4. ఆస్ట్రేలియా నిల్వలు: 5.7 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఉత్పత్తి 13,000 మెట్రిక్ టన్నులు. 5. రష్యా నిల్వలు: 3.8 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఉత్పత్తి 2,500 మెట్రిక్ టన్నులు.
6. వియత్నాం నిల్వలు: 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఉత్పత్తి 300 మెట్రిక్ టన్నులు. 7. అమెరికా నిల్వలు: 1.9 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఉత్పత్తి 45,000 మెట్రిక్ టన్నులు. 8. గ్రీన్ ల్యాండ్ నిల్వలు: 1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఉత్పత్తి లేదు. 9. టాంజానియా నిల్వలు: 0.9 మిలియన్ టన్నులు. ఉత్పత్తి లేదు. 10. దక్షిణాఫ్రికా నిల్వలు: 0.9 మిలియన్ టన్నులు. ఉత్పత్తి లేదు. 2024లో ఆర్ఈఈల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానం కాగా, అమెరికా రెండో స్థానంలో ఉన్నాయి.
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించే రంగాలు
స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, ఫ్లోరోసెంట్, లైట్-ఎమిటింగ్-డయోడ్ (ఎల్ఈడీ) లైట్లు, ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్లు, కంప్యూటర్ మానిటర్లు, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ టెక్నాలజీలు, విండ్ టర్బైన్లు, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎంఆర్ఐ స్కానర్లు, క్యాన్సర్ చికిత్స పరికరాలలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలలో మూడో స్థానంలో ఉన్న భారతదేశం వాటిని ఉత్పత్తి చేయటంలో చైనాను అధిగమించాల్సిన అవసరం ఉన్నది.
డా..శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్