
పారిస్: స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి టైటిల్ నెగ్గేందుకు అడుగు దూరంలో నిలిచాడు. మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కార్లోస్ అందుకు తగ్గ ఆటతీరుతో వరుసగా రెండోసారి ఫైనల్ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ అల్కరాజ్ 4–-6, 7–-6(6/3), 6–-0, 2–-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి ఎనిమిదో సీడ్ లోరెంజో ముసెట్టి (ఇటలీ) గాయంతో ఆట నుంచి వైదొలిగాడు. దాంతో వాకోవర్ విజయంతో కార్లోస్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ శతాబ్దంలో రఫెల్ నడాల్, గుస్తావో కుయెర్టెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న మూడో ఆటగాడిగా నిలవాలని ఆశిస్తున్న అల్కరాజ్ సెమీఫైనల్లో ఆరంభంలో నిరాశపరిచినా తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. స్టార్టింగ్‌లో సూపర్‌గా ఆడిన ముసెట్టి తన డిఫెన్స్‌తో అలరించాడు.
తొలి తొమ్మిది గేమ్స్‌లో రెండుసార్లు అల్కరాజ్ తన సర్వీస్ చేసేందుకు దగ్గరగా వచ్చినా.. ముసెట్టి ఆ చాన్స్ ఇవ్వలేదు. ఆపై, ఒక్కసారిగా జోరు పెంచిన 23 ఏండ్ల ఇటలీ ప్లేయర్ అల్కరాజ్ సర్వీస్ గేమ్‌లో చేసిన పొరపాట్లను సద్వినియోగం చేసుకుని తొలి సెట్‌ను 6-–4 తేడాతో కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లోనూ కార్లోస్‌కు సవాల్ విసిరాడు. దీంతో నిరాశకు గురైన అల్కరాజ్ అసహనంతో తన బెంచ్‌ను తన్నాడు. చివరకు ముసెట్టి డిఫెన్స్‌ను బ్రేక్ చేసిన స్పెయిన్ ప్లేయర్ టై బ్రేక్‌లో సెట్‌ను గెలిచి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత మూడో సెట్‌లో అల్కరాజ్ తన మార్కు ఆట చూపెట్టాడు. ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఆ సెట్ గెలిచిన డిఫెండింగ్ చాంపియన్ నాలుగో సెట్‌లోనూ వరుసగా రెండు గేమ్స్ గెలిచాడు. ఈ దశలో ముసెట్టి గాయానికి గురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. 2 గంటల 25 నిమిషాల ఈ పోరులో ఒక ఏస్ కొట్టిన కార్లోస్, 35 విన్నర్లు సంధించి, ఆరు బ్రేక్ పాయింట్లు రాబట్టాడు. రెండు డబుల్ ఫాల్ట్స్, 32 అనవసర తప్పిదాలు చేశాడు.
నంబర్ 1 x 2
విమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంక, రెండో ర్యాంకర్ కోకో గాఫ్ శనివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. 18 ఏండ్ల వయసులో 2022లో ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఓడిన అమెరికా స్టార్ గాఫ్ మరోసారి టైటిల్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2023 యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెలారస్ స్టార్ సబలెంకను ఓడించిన కోకో అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని చూస్తోంది. కానీ, సబలెంక అద్భుతమైన ఫామ్‌లో ఉంది. సెమీఫైనల్‌లో మూడుసార్లు డిఫెండింగ్ చాంపియన్ అయిన ఇగా స్వైటెక్‌ను ఓడించిన అరీనా ఫైనల్లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇద్దరి మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో చెరో ఐదు విజయాలతో (5–5) సమంగా ఉన్నారు. సబలెంక పవర్‌ఫుల్ హిట్టింగ్‌కు, గాఫ్ అద్భుతమైన డిఫెన్స్‌కు మధ్య జరిగే ఆసక్తికర పోరులో ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.