
మీ స్మార్ట్‌ఫోన్ కాలింగ్ స్క్రీన్ ఎం చేయకుండానే మారిపోయిందని అనుకుంటున్నారా ? ఆండ్రాయిడ్ ఫోన్ వాడే చాలా మంది ప్రస్తుతం ఇలాగే అనుకుంటున్నారు. మీరు ఎలాంటి సెట్టింగ్స్ మార్చకపోయినా, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోయినా ఇలా ఎందుకు జరిగింది అని చాలామందికి డౌట్ వస్తుంది... కాలింగ్ స్క్రీన్ దానంతట అదే ఎందుకు మారిపోయింది ? ఫోన్ ఏమైనా హ్యాక్ అయ్యిందా ? పాత కాలింగ్ స్క్రీన్ కి మార్చుకోవాలంటే ఏం చేయాలి ?
ఫోన్ కాలింగ్ స్క్రీన్ ఎందుకు మారిందంటే : ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు కాలింగ్ యాప్ కూడా గూగుల్ సంస్థ తయారు చేసింది. ఈ యాప్ పనితీరు మెరుగుపర్చడానికి గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తుంటుంది. అందుకే కాల్స్ కోసం ఉపయోగించే ఫోన్ బై గూగుల్ యాప్‌కి ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. ఈ అప్‌డేట్ వల్ల మీ మొబైల్ కాలింగ్ స్క్రీన్ డిజైన్ మారిపోయింది. ఈ అప్‌డేట్‌ని మెటీరియల్ 3D ఎక్స్‌ప్రెసివ్ అని పిలుస్తారు.
గూగుల్ మొదట ఈ అప్‌డేట్‌ను కొంతమందికి మాత్రమే ఇచ్చింది. దాన్ని పరీక్షించిన తర్వాత ఇప్పుడు లక్షల మందికి అందుబాటులోకి తెచ్చింది. ఇది అనుకోకుండా వచ్చిన అప్‌డేట్ కాదు. గూగుల్ 13 మే 2025న ఓ బ్లాగ్‌లో ఈ కొత్త అప్‌డేట్ గురించి ముందే చెప్పింది.
ఈ అప్‌డేట్ వల్ల కాలింగ్ స్క్రీన్‌లో ఏ మార్పులు: జూన్ 24న గూగుల్ ఫోన్ యాప్‌లో మూడు మార్పులను ప్రకటించింది. ఇప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడేవాళ్ళ నెంబర్లను డయలర్ స్క్రీన్‌పైన పిన్ చేసుకోవచ్చు. కాల్స్ చేసిన వాళ్ల పేర్ల పక్కన ఉండే గుండ్రటి "i" బటన్ ఇప్పుడు లేదు. మీరు పేరు మీద నొక్కితే కింద ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మెసేజ్, కాల్ హిస్టరీ, వీడియో కాల్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
ఇంకా ఇప్పుడు మీకు కాల్ వచ్చినప్పుడు ఎరుపు రంగులో పెద్ద బటన్ కనిపిస్తుంది. కాల్ మాట్లాడాలంటే కుడివైపుకు కాల్ కట్ చేయాలంటే ఎడమవైపుకు స్వైప్ చేయాలి. వీటితో పాటు ఫోన్ యాప్ కింద ఇప్పుడు మీకు హోమ్ అండ్ కీప్యాడ్ ఆప్షన్లు కనిపిస్తాయి.
కారణం ఏంటంటే : కొత్త కాల్ లాగ్ డిజైన్‌తో ఒకే నెంబర్ నుండి వచ్చిన కాల్స్ ఒకే చోట కాకుండా టైం ప్రకారం వరుసగా కనిపిస్తాయి. దీంతో మీకు కావాల్సిన నెంబర్ ఈజీగా దొరుకుతుంది. కొంతమంది ఫోన్ జేబులోంచి తీసేటప్పుడు అనుకోకుండా కాల్ కట్ అయిందని అంటుంటారు. ఈ సమస్యను తొలగించడానికి ఇప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయాలంయే స్క్రిన్ పై స్వైప్ చేయాలి. అంతేకాదు గూగుల్ ఈ కొత్త డిజైన్‌తో కాల్ యాప్ వేగంగా పని చేస్తుందని, వాడటానికి కూడా ఇంకా స్ముతుగా ఉంటుందని చెప్పింది.
పాత స్క్రీన్ కావాలనుకుంటే : ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ తీసేసే అవకాశం లేదు. అంటే పాత కాలింగ్ స్క్రీన్‌కి మార్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక భాగం. మీకు ఈ కొత్త డిజైన్ నచ్చకపోతే వేరే థర్డ్-పార్టీ కాలింగ్ యాప్‌లను ఉపయోగించవచ్చు.