
- పార్టీ ఆఫీసును పరిశీలించిన పోలీసులు, ఇంటెలిజెన్స్ సహా అన్ని శాఖల ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్ గాంధీభవన్ సెక్యూరిటీపై అధికారులు రివ్యూ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సీఎం, మంత్రులు, ఇతర వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుండడంతో భద్రతకు సంబంధించిన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల ఆఫీసర్లు గాంధీభవన్‌లో రివ్యూ చేశారు. గురువారం గాంధీభవన్ అధికారులతో సమావేశమై పలు విషయాలను తెలుసుకున్నారు. డీసీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, మెడికల్ అండ్ హెల్త్, మున్సిపల్ సహా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పార్టీ ఆఫీసును పరిశీలించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నప్పుడు ఆయన ఆఫీసులోకి రావడానికి అనుకూలంగా ఉండే గేట్లు, వాటి పటిష్ఠతకు సంబంధించి అధికారులు చర్చించినట్టు తెలిసింది. విద్యుత్, వాటర్, శానిటేషన్ వంటి మౌలిక వసతులపైనా రివ్యూ చేశారని చెప్తున్నారు. పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు సీఎం రేవంత్‌రెడ్డి తరచుగా పార్టీ ఆఫీసుకు రావాల్సి ఉండటం వల్లే రొటీన్‌గా జరిగే రివ్యూల్లో భాగంగానే.. ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఈ రివ్యూలు చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పార్టీ ఆఫీసు వద్ద పోలీసు భద్రతనూ పెంచారు.
టైట్ సెక్యూరిటీ
పార్టీ ఆఫీసులో రేవంత్ సమీక్షలు నిర్వహించే సమయంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పటిలాగా కాకుండా కేవలం అనుమతించిన వ్యక్తులనే లోపలికి రానిస్తున్నారు. మీటింగ్‌లలో పాల్గొనేవారి జాబితాను తీసుకుని.. ఆ జాబితాలో పేరున్న వారిని మాత్రమే పార్టీ ఆఫీసులోకి అనుమతిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైనా పెద్ద మీటింగ్ జరిగితే గాంధీభవన్ మొత్తం ప్యాక్ అయిపోయేది. ఇప్పుడు సీఎం, మంత్రుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు. గాంధీభవన్‌లో సీఎం ఉన్నంత సేపు పార్టీ ఆఫీసు బయటి రెండు గేట్లకూ తాళాలేస్తున్నారు. లోపలి వాళ్లను బయటకు.. బయటి వాళ్లను లోపలికి అనుమతించడం లేదు. సీఎం పర్యటన ఉన్నప్పుడు కొంచెం ముందుగానే స్పెషల్లీ ట్రైన్డ్ గార్డ్స్‌తో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌ను 6 కార్లకు తగ్గించుకున్నారు. కాన్వాయ్‌లోనూ తన సొంత కారులోనే ఆయన రాకపోకలు సాగిస్తున్నారు. ఇటు ట్రాఫిక్‌ను ఆపకుండా సామాన్య జనంతో పాటే సీఎం కాన్వాయ్ కూడా ప్రయాణిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం భద్రతకు సంబంధించి అధికారులు పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.