
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడు? దీనికి కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఏవైనా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిస్తామని, అవి ఏవి అనేవి ముందుముందు తెలుస్తుందని చెప్పాడు. కానీ బుమ్రాలాంటి బౌలర్‌ను ఐదు మ్యాచ్‌లు ఆడించాలంటే ఏం చేయాలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు.
‘ఎక్కువ బౌలింగ్, తక్కువ బౌలింగ్ రెండూ గాయాలకు కారణమవుతాయి. కొంత మంది బౌలర్లు ఎక్కువగా దీనివల్లే గాయపడతారు. కాబట్టి బుమ్రా ఒక్క మ్యాచ్‌లో ఎన్ని ఓవర్లు వేస్తాడో మనం నియంత్రించలేం. కానీ ఆ మ్యాచ్‌లో అతను వేసే ఓవర్ల సంఖ్యను బట్టి అతను కోలుకోవడానికి అవసరమైన చోట ప్రాక్టీస్ సెషన్స్ తగ్గించాలి. ఇది జిమ్‌లో స్ట్రెంత్ ట్రెయినింగ్ సెషనైనా కావొచ్చు. ఫిజియోలతో గడిపే టైమైనా కావొచ్చు’ అని భరత్ పేర్కొన్నాడు.
జట్టులో ఉంటే చాలు..
బుమ్రా జట్టులో ఉంటే చాలా ఉపయోగాలుంటాయని భరత్ తెలిపాడు. ‘బుమ్రా ఉత్తమ బౌలర్ మాత్రమే కాదు. అతను జట్టులో ఉండటం వల్ల ఇతర బౌలర్లు కూడా ఉత్తమంగా రాణిస్తారు. అందుకే మిగతా బౌలర్లు కాస్త సహకరిస్తే బుమ్రా ఐదు మ్యాచ్‌లు ఆడగలడు. ఆస్ట్రేలియాలో జరిగిన దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. బుమ్రాకు కొంత విశ్రాంతి అవసరం. అలాగని పూర్తిగా కూర్చోబెట్టలేం. టీమ్‌లో అతను లేకుంటే ఇతర బౌలర్లు వికెట్లు తీయడానికి, రన్స్‌ను నియంత్రించడానికి చాలా ఇబ్బందిపడతారు.
ఒకవేళ వాళ్లు అలా చేయకపోతే గంభీర్ చెప్పినట్లు బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడతాడు. కాబట్టి అతన్ని ఉపయోగించుకోవడం చాలా కీలకం. జట్టులో ఉంటే విలువ పెరగడంతో పాటు ఇతర బౌలర్లను కూడగట్టడంలోనూ తోడ్పాటు అందిస్తాడు. ’ అని భరత్ వివరించాడు. పని భారాన్ని పంచుకుంటూ ఇతర బౌలర్లు కూడా రాణిస్తే బుమ్రాను ఐదు టెస్ట్‌ల్లోనూ ఆడిస్తేనే మంచిదన్నాడు. తొలి మూడు టెస్ట్‌లు ఆడించాలని చెప్పడం కంటే విరామం ఇస్తూ ఇతర బౌలర్లు కూడా వికెట్లు తీస్తే అన్ని మ్యాచ్‌ల్లోనూ బుమ్రా ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.