ఒక్కో నియోజకవర్గంలో ఎంతమందికి దళితబంధు !

ఒక్కో నియోజకవర్గంలో ఎంతమందికి దళితబంధు !
  • బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారుల తర్జనభర్జన

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు నిధుల కేటాయింపు ప్రతిపాదనలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఒక్కోసారి ఒక్కోలా నిధుల కేటాయింపుపై ప్రకటనలు చేయడంతో అయోమయంలో ఉన్నారు. గురువారం ఫైనాన్స్, ఎస్సీ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి హరీశ్​రావు నిర్వహించిన సమీక్షలోనూ బడ్జెట్ ప్రపోజల్స్​పై నిర్ణయానికి రాలేదు. ఒక్కో నియోజకవర్గానికి ఎంత మందికి ఇస్తే ఎంత ఖర్చవుతుంది? ఆ మేరకు నిధులు సర్దుబాటు చేయగలమా? అనే దానిపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకో రూ.1,500 కోట్లదాకా దళితబంధు ఇచ్చే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్పినట్లు తెలిసింది. మొత్తంగా రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలని అనుకుంటున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ దానిపై ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున ఇస్తే రూ.10 వేల కోట్లు, 1500 మందికి ఇస్తే రూ.15 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు వేస్తోంది. పెద్ద మొత్తంలో కేటాయింపులు చేసి, బడ్జెట్​లో నిధులు ఇయ్యకపోతే ఇబ్బందులు వస్తాయనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పుడు నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులకు ఇచ్చేందుకే తంటాలు పడాల్సి వస్తోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అదే వెయ్యి, రెండు వేల మంది అంటే.. మిగతా వారి నుంచి ఇంకా వ్యతిరేకత వచ్చేలా ఉందని వాళ్లు సర్కార్​ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.