- అత్యధిక డ్రాపౌట్స్ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్
- దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాలికలు చదువుకు దూరం
- ఆర్థిక ఇబ్బందులు, వలసలు, బాల కార్మిక వ్యవస్థ ప్రధాన కారణాలు
న్యూఢిల్లీ: చదువుకోవడంలో తెలంగాణ అమ్మాయిలు ముందుంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే బడి మధ్యలో మానేస్తున్న బాలికల సంఖ్య మన రాష్ట్రంలో తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా లక్షలాది అమ్మాయిలు పాఠశాలలకు దూరమవుతుండగా.. తెలంగాణలో మాత్రం డ్రాప్ అవుట్ రేటు అత్యంత తక్కువగా 31.1 శాతం ఉంది. ఇది దేశంలోనే అతి తక్కువ డ్రాపౌట్స్. ఆ తర్వత 33.2 శాతం కేరళలో, 33.3 శాతంతో లద్దాఖ్ లో తక్కువ డ్రాపౌట్స్ ఉన్నాయి. సోమవారం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మహిళా, బాలిక అభివృద్ధి శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్ ఈ వివరాలు వెల్లడించారు. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో విద్యా సంక్షోభం తీవ్రంగా ఉంది. 2022 నుంచి 2026 వరకు 84.9 లక్షల మంది పిల్లలు మధ్యలోనే చదువు వదిలేశారు. ఇందులో సగానికంటే ఎక్కువగా అమ్మాయిలున్నారు. ప్రీ-స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఈ డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నాయి.
అయితే తెలంగాణలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి స్కూళ్లలో వాష్రూమ్స్, డ్రింకింగ్వాటర్, సరిపడా తరగతి గదులు వంటి మెరుగైన మౌలికవసతులు ఉండడం అమ్మాయిల ఎన్రోల్మెంట్ను పెంచుతున్నాయి. స్కూళ్లలో అత్యధిక సంఖ్యలో మహిళా టీచర్లు ఉండడం కూడా మరో ప్రధాన కారణం. అలాగే తెలంగాణ సమాజంలో బాలికల విద్యపై అవగాహన పెరిగింది. తల్లిదండ్రులు అమ్మాయిల్ని ఇంటి పనులకు పరిమితం చేయకుండా స్కూలుకు పంపిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో డ్రాపౌట్స్ ఎక్కువ
ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో 9.9 లక్షల మంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. గత ఐదేండ్లలో ఈ రాష్ట్రంలోనే డ్రాపౌట్స్ ఎక్కువ నమోదయ్యాయి. అమ్మాయిల డ్రాప్ అవుట్ రేటు యూపీలో అత్యధికంగా 57 శాతం కాగా.. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, బిహార్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం ఉన్నాయి. పిల్లలు చదువు మధ్యలోనే మానేసేందుకు ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నట్టు తెలుస్తున్నది. అవి.. కుటుంబాలు పని కోసం వలస వెళ్తూ పిల్లల్ని తమతో తీసుకెళ్తున్నారు. సామాజిక-ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో పెద్ద పిల్లలపై పనుల భారం పడుతుండడం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉండడం.
తిరిగి బడిలో చేర్చే ప్రయత్నాలు
ఐదేళ్లలో 26.46 లక్షల మంది పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సమగ్ర శిక్ష పథకం రూ.626 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ స్కూళ్లు నడిపారు. వలస వెళ్లే కుటుంబాల్లోని పిల్లల కోసం సీజనల్ హాస్టల్స్, రవాణా సౌకర్యాలు కల్పించారు.
