ఆవాస్ యోజన కింద కట్టించిన ఇండ్లెన్ని : మంత్రి సీతక్క

ఆవాస్ యోజన కింద కట్టించిన ఇండ్లెన్ని : మంత్రి సీతక్క
  •  బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి
  • రాహుల్ గాంధీని పీఎం చేయడమే లక్ష్యం
  •  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు(గోవిందరావుపేట), వెలుగు : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇండ్లు కట్టించారో బీజేపీ లీడర్లు సమాధానం చెప్పాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సవాల్ చేశారు.  మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపేటలో మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మహబూబాద్ అభ్యర్థి బలరాం నాయక్‌, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌తో కలిసి  చీఫ్‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు.

 ఆదాయం రెట్టింపు దేవుడెరుగు.. పెట్టుబడి లేక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు.  బీఆర్‌‌ఎస్‌ పదేళ్లలో తెలంగాణను దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.  ఇటీవల కొందరు దుర్మార్గులు తనపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా సేవ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. 

తాను ప్రజల మనిషినని, తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకు కాలమే సమాధానం చెబుతుందన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు.  రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా..  పార్లమెంట్‌ ఎన్నికల్లో  బలరాం నాయక్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.