ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ APGVB ఉద్యోగుల కంటతడి

ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ  APGVB ఉద్యోగుల కంటతడి

ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ సంగారెడ్డిలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక ఇళ్లు గడవటం కష్టంగా మారిందన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంట్లో  నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటికైనా తమకు వచ్చే జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

‘ఆరు నెలలుగా జీతాలు లేవు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల స్కూల్ ఫీజు కట్టలేక, ఇంట్లో నిత్యావసరాలు లేక చెప్పరాని అవస్ధలు పడుతున్నాం. మాకు పొలం కూడా లేదు. పర్మినెంట్ చేస్తారనే ఆశతో రూ. 10 వేలకే పని చేసుకుంటూ వస్తున్నం ’ అని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. 

‘నాది మహబూబాబాద్ జిల్లా. గత 22 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఏపీలో మూడు, తెలంగాణలో ఐదు జిల్లాలున్నయ్​. మొత్తం 8 జిల్లాలకు ఛైర్మన్ ఉన్నారు. ఏపీకి మూడు జిల్లాలు పోయిన తర్వాత.. తెలంగాణ గ్రామీణ బ్యాంకు అని చేస్తుండ్రు. వీళ్లు APGVBకి ట్రాన్స్ ఫర్ అవుతారు. తమను ఏజెన్సీ కింద తీసుకుంటామని చెప్తుండ్రు. అప్పుడు మా పరిస్థితి ఏంటీ ? మాకు ఎప్పుడు పర్మినెంట్ అవుతది. కోర్టులో కేసు ఉన్నా..ఏం ఉపయోగం లేదు. ఇప్పటికీ 9 సార్లు వాయిదా పడుతూ వస్తోంది. సుప్రీం, హైకోర్టు ఆర్డర్ ఉంది. తెలంగాణలో ఎన్ని కోట్లు ఖర్చు కావట్లె ?’ అంటూ మరో ఉద్యోగి కన్నీళ్లు పెట్టుకున్నారు.  తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.